అల్పాదాయ దేశాల్లోని ప్రతి ఒక్క చిన్నారి, గర్భిణీకి సామాజిక భద్రత(social protection) కల్పించేందుకు ప్రపంచ దేశాలు కృషి చేయాలన్నారు నోబెల్ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి (kailash satyarthi news). అందుకు 52 బిలియన్ డాలర్లు(రూ.3.85 లక్షల కోట్లు) అవసరమవుతాయన్నారు. 2వేలకుపైగా బిలియనీర్లు ఉన్న ప్రపంచంలో ఇది అంత పెద్ద మొత్తం కాదన్నారు.
'పేదరిక నిర్మూలన(poverty eradication), స్థిరమైన రికవరీ కోసం.. ఉపాధి, సామాజిక భద్రత కల్పన'పై ఐక్యరాజ్య సమితి మంగళవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో వర్చువల్గా ప్రసంగించారు సత్యార్థి. బాలకార్మికులు, పేదరికాన్ని అరికట్టేందుకు ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే నాయకత్వం కావాలని పిలుపునిచ్చారు.
" 52 బిలియన్ డాలర్లు అంత పెద్ద మొత్తం కాదు. అది ధనిక దేశాల్లో.. రెండు రోజుల పాటు కొవిడ్ ఉపశమనం చర్యల కోసం ఖర్చు చేసిన నగదుతో సమానం. మనం అంత పేదవారిమేమీ కాదు. 2,755 మంది బిలియనీర్లు ఉన్న ప్రపంచం నిరుపేదదనే మాటను నేను తిరస్కరిస్తున్నా. సరైన వనరులు లేనప్పుడే మంచి పురోగతి సాధించాం. చిన్నారులకు సాయం చేశాం. బాలకార్మికుల సంఖ్యను తగ్గించాం. ప్రస్తుతం ప్రపంచంలో సాంకేతికంగా, ఇతర రంగాల్లో సరిపడా వనరులు అందుబాటులో ఉన్నాయి. పేదరిక నిర్మూలన కోసం గతంలో పోరాడాం. భవిష్యత్తులోనూ చేస్తాం. ధైర్యమైన ఆలోచనలకు కొరత లేదు. కానీ, మనకు ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే నాయకులు అవసరం."