ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మందికి(ప్రతి 10 మందిలో ముగ్గురికి) ఇళ్లల్లో చేతులు శుభ్రపరుచుకునేందుకు కనీస సౌకర్యాలు లేవని యూనిసెఫ్ వెల్లడించింది. 'అంతర్జాతీయ హ్యాండ్ వాష్ డే'(global handwashing day 2021) సందర్భంగా.. విడుదల చేసిన నివేదికలో(UNICEF latest report) ఈ విషయాన్ని తెలిపింది. అల్ప అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ పరిస్థితి మరీ దయనీయంగా ఉందని పేర్కొంది. ఆ దేశాల్లో ప్రతి 10 మందిలో ఆరుగురికి చేతులు కడుక్కునేందుకు సబ్బు, నీరు వంటి సదపాయాలు అందుబాటులో లేవని యూనిసెఫ్ తన నివేదికలో(UNICEF latest report) స్పష్టం చేసింది. కరోనా వేళ ఈ సమస్య మరింత పెరిగిందని తెలిపింది.
నివేదికలో ముఖ్యాంశాలు..
- ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదు పాఠశాలల్లో రెండింటిలో విద్యార్థులు చేతులు కడుక్కునేందుకు సబ్బు, నీరు వంటి సదుపాయాలు అందుబాటులో లేవు. ఫలితంగా 81.80కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమవుతున్నారని.. ఇందులో 46.2కోట్ల మంది విద్యార్థులు ఎలాంటి సౌకర్యాలు లేని పాఠశాలలకు హాజరవుతున్నారు. అల్ప అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి పదింటిలో ఏడు పాఠశాలల్లో పిల్లలు చేతులు కడుక్కోవడానికి చోటు లేదు.
- ప్రపంచవ్యాప్తంగా మూడింట ఒక వంతు ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో.. చేతులు పరిశుభ్రం చేసుకునే సౌకర్యాలు అందుబాటులో లేవు.
- 2015 నుంచి ఈ విషయంలో ప్రపంచం పురోగతి సాధించింది.
- ఇంట్లో చేతులు పరిశుభ్రం చేసుకునే సౌకర్యాలు లేని వారి శాతం ప్రపంచ జనాభాలో 67 నుంచి 71కి పెరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే దశాబ్దం చివరినాటికి 1.9 బిలియన్ ప్రజలకు ఈ సౌకర్యాలు అందుబాటులో ఉండవు.
- 2030నాటికి ప్రపంచంలో 46 అల్ప అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రతి ఇంటికి ఈ సౌకర్యాలు అందించడానికి 1100కోట్లు ఖర్చు అవుతుంది.