బ్రెజిల్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపిలేని వర్షాలతో సావో పౌలో, రియో డీ జెనిరో రాష్ట్రాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వరదల్లో చిక్కుకొని ఇప్పటివరకు 21 మంది మృతి చెందారు. మృతుల్లో 16మంది సావో పౌలో, ఐదుగురు రియో డి జెనిరోకు చెందినవారు. 32 మంది గల్లంతయ్యారు. కొండచరియలు విరిగిపడి వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి.
సాధారణంగా బ్రెజిల్‌లో నెల రోజుల వ్యవధిలో కురిసే వర్షం కొద్ది గంటల వ్యవధిలో కురవడమే ఈ వరదలకు కారణమని ఆ దేశ వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కొండ చరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో హైవేలపై రాకపోకలను నిషేధించారు అధికారులు. ఐదువేలమందిని ఇళ్లనుంచి బయటకు రప్పించారు.