తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​ అధ్యక్ష పదవికి '2020' ఎసరు! - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​

కరోనా వైరస్​.. దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థ... పోలీసుల కర్కశత్వం.. ఇవీ 2020లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమస్యలు. మరో ఐదు నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో.. వీటి నుంచి గట్టెక్కి.. ఓటర్లను ట్రంప్​ ఎలా ఆకర్షిస్తారన్నది ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది.

2020 Watch: Has Trump hit bottom? Polls show him trailing 2020
ట్రంప్​ అధ్యక్ష పదవికి '2020' ఎసరు!

By

Published : Jun 8, 2020, 5:29 PM IST

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్​ ట్రంప్​ 2020లో గడ్డుపరిస్థితులను ఎదుర్కొన్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మరో ఐదు నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో ట్రంప్​కు ఇలాంటి సమస్యలు ఎదురవడం రిపబ్లికన్లకు ఆందోళన కలిగించే విషయం.

కరోనా వైరస్​ మహమ్మారి బారి నుంచి దేశాన్ని రక్షించడంలో ట్రంప్​ విఫలమయ్యారని విమర్శలున్నాయి. వైరస్​ నియంత్రణపై ట్రంప్​ వైఖరి కూడా చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, పోలీసుల కర్కశత్వం రూపంలోనూ అధ్యక్షుడికి అనేక చిక్కులు వచ్చిపడ్డాయి.

ఈ నేపథ్యంలో... దేశంలోని పరిస్థితులు చేయి దాటిపోతున్నాయని 80శాతం మంది అమెరికన్లు భావిస్తున్నట్టు వాల్​ స్ట్రీట్​ జర్నల్​, ఎన్​బీసీ న్యూస్​ పోల్​ నివేదించింది. ఈ నివేదిక రిపబ్లికన్ల గుండెల్లో గుబులు రేపుతోంది.

మరోవైపు అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్​ అభ్యర్థి జో బిడెన్​ కన్నా ట్రంప్​ వెనుకంజలో ఉన్నట్టు చెబుతున్న పోల్స్​ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.

ఆశా కిరణం...!

ఇన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఓ సానుకూల నివేదిక ట్రంప్​ తలుపు తట్టింది. దేశంలో గత నెలలో అమెరికన్లకు.. అంచనాలకు మించిన ఉద్యోగాలు లభించాయని ఈ నివేదిక పేర్కొంది. ట్రంప్​కు ఇది చిన్న ఉపశమనంతో పాటు ఆశా కిరణంలా మారింది. దేశం సరైన మార్గంలోనే నడుస్తోందని.. అన్ని ప్రతికూల అంశాలపై పట్టుసాధిస్తున్నట్టు వెంటనే ప్రకటించారు.

అయితే పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నట్టు అధ్యక్షుడి సన్నిహిత రిపబ్లికన్లు కూడా అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. కానీ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే ట్రంప్​ మరోమారు ఓటర్లను ఆకర్షించే అవకాశముందని భావిస్తున్నారు.

దూసుకుపోతున్న బిడెన్​...

మరోవైపు ట్రంప్​ ప్రత్యర్థి బిడెన్ ప్రచారంలో​ దూసుకుపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల నుంచి లబ్ధిపొందాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్​ వైఫల్యాలను ప్రచారంలో అస్త్రాలుగా వాడుకుంటున్నారు. గృహ, విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి తాను రూపొందించే ఆర్థిక ప్రణాళికను ఈ వారంలో విడుదల చేస్తానని ఇప్పటికే వెల్లడించారు బిడెన్​. దీనికోసం అమెరికా ఎదురుచూస్తోంది. దీనితో బిడెన్​ పాలన ఎలా ఉంటుందో కొంత మేర అవగాహన కలిగే అవకాశముంది. నవంబర్​లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లు వేయడానికి ప్రజలు దీనిని పరిగణించే అవకాశముంది.

ఇదీ చూడండి:-జాతి వివక్షతో నేల రాలిన ప్రాణాలు- ఉద్భవించిన ఆశలు

ABOUT THE AUTHOR

...view details