ఈ ఏడాది మూడో త్రైమాసికంలో దేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 5.3 కోట్ల యూనిట్ల మార్క్ దాటింది. కౌంటర్ పాయింట్ సర్వేలో ఈ విషయం తేలింది. జూలై-సెప్టెంబర్ మధ్య స్మార్ట్ఫోన్ల షిప్మెంట్లు గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే.. 9 శాతం పెరిగాయని సర్వే వివరించింది.
అగ్రస్థానంలో శాంసంగ్..
ఆన్లైన్ మార్కెట్లో.. 2020 మూడో త్రైమాసికంలో శాసంగ్ 24 శాతం వాటాతో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లీడర్‌గా నిలిచింది. 23 శాతం వాటాతో చైనాకు చెందిన షియోమీ రెండో స్థానంలో ఉంది. మార్కెట్ సగటు విక్రయ ధర మిడ్ రేంజ్ సెగ్మెంట్లో (రూ.10 వేల నుంచి రూ.20 వేల మధ్య) షిప్మెంట్లు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి.
కౌంటర్ పాయింట్ సర్వే ప్రకారం..
దాదాపు రెండేళ్ల తర్వాత భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అగ్రస్థానంలో నిలిచింది శాంసంగ్. గత ఏడాదితో పోలిస్తే 32 శాతం వృద్ధి సాధించడం ఇందుకు దోహదం చేసింది. కొవిడ్ పరిస్థితుల్లోనూ శాంసంగ్ ఈ స్థాయిలో వృద్ధి నమోదు చేసేందుకు.. శాంసగ్ అమలు చేసిన వివిధ రకాల వ్యూహాలే కారణం. సప్లయి పెంచుకోవడం, వేర్వేరు ధరల్లో ఎక్కువ సంఖ్యల్లో ఫోన్లను విడుదల చేయడం, ఆన్లైన్లో భారీగా ప్రమోషన్లు చేయడం వంటివి ఇందులో ప్రధానమైనవి.
షియోమీ రెండో స్థానానికి పరిమితం ఎందుకు?
2018 క్యూ3 నుంచి భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రారాజుగా వెలుగొందుతూ వచ్చిన షియోమీ.. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రెండో స్థానానికి పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే.. 4 శాతం క్షీణతను నమోదు చేసింది. సప్లయి, డిమాండ్ అంతరాలు ఇందుకు కారణం కావచ్చని కౌంటర్ పాయింట్ పేర్కొంది.
ప్రీమియం సెగ్మెంట్లోకి వివో..
గత ఏడాదితో పోలిస్తే చైనాకు చెందిన మరో కంపెనీ వివో 4 శాతం వృద్ధితో మూడో స్థానంలో నిలిచింది. వివో వై-సిరీస్ మొబైళ్లకు ఆఫ్‌లైన్ ఛానెళ్ల నుంచి వచ్చిన డిమాండ్ ఇందుకు ప్రధాన కారణం. దీనికి తోడు ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఎక్స్50 మోడల్‌తో ప్రీమియం మార్కెట్లోకీ ప్రవేశించి వినియోగాదారుల నుంచి సానుకూల స్పందనను దక్కించుకుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీదే అగ్రస్థానం..
రియల్మీ కూడా గత ఏడాదితో పోలిస్తే.. 2020 క్యూ3లో 4 శాతం వృద్ధి సాధించింది. సప్లయి సమస్యలను అధిగమించడం, ఉత్పత్తిని పెంచడం వంటివి ఇందుకు దోహదం చేశాయి. సీ సిరీస్, నార్జో వంటి ఫోన్లు రియల్మీ వృద్ధికి ఉపయోగపడ్డాయి. రియల్మీ 6,7 సిరీస్‌లకు వచ్చిన డిమాండ్.. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఈ కంపెనీ 52 శాతం వృద్ధి నమోదు చేసేందుకు తోడ్పడ్డాయి. దీనితో ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ స్థానాన్ని రియల్మీ నిలబెట్టుకోగలిగింది.