ప్రస్తుత తరం జీవిత కాలం.. నిద్రలో సైతం గుర్తుంచుకునే సంవత్సరం 2020. యావత్ ప్రపంచంలో మరణ మృదంగం మోగించిన మహమ్మారి కరోనా విజృంభణతో.. చరిత్రలో ఓ ప్రత్యేక అధ్యాయాన్నే లిఖించుకుంది 2020. ఇది మాత్రమే కాదు.. ప్రపంచాన్ని కుదిపేసిన అనేక సంఘటనల సమాహారం ఈ సంవత్సరం. భారీ ప్రమాదాలు, ప్రముఖుల మరణాలు, రాజకీయ సంక్షోభాలతో 2020 ఎన్నటికీ మరవని చేదు గుర్తులను విడిచి వీడ్కోలు తీసుకుంటోంది.
ఏడాదంతా తనదే
మొట్టమొదట చెప్పుకోవాల్సింది కచ్చితంగా కరోనా మహమ్మారి గురించే. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మానవజాతి అంతగా భయపెట్టింది కరోనానే. 2019లోనే ఇది వెలుగు చూసినా.. 2020లో ప్రపంచవ్యాప్తంగా విస్తరించి తన విశ్వరూపాన్ని చూపించింది. వుహాన్‌లో కొత్త రకం న్యూమోనియా కేసులు నమోదవుతున్నాయన్న చైనా అధికారిక ప్రకటనను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) 2019, డిసెంబరు 31న తొలిసారి పరిగణనలోకి తీసుకుంది. అనంతరం కొత్త సంవత్సరం రోజే దీనికి సంబంధించిన వివరాల్ని కోరింది. రోజులు గడుస్తున్న కొద్దీ వైరస్ మరింత వేగంగా వ్యాపించింది. జనవరి 9న ఇది కొత్తరకం కరోనా వైరస్ అని ప్రపంచానికి తెలిసింది. కొన్నాళ్ల తర్వాత ఇది ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తోందని అర్థమైంది. జనవరి 11న తొలి మరణం నమోదైంది. అదే నెల 13న చైనా వెలుపల తొలి కేసు నమోదైంది. అలా డ్రాగన్ సరిహద్దుల్ని దాటిన మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా దావాగ్నిలా వ్యాపించింది. నేటికి 7,79,25,298 మందికి సంక్రమించింది. వీరిలో 17,14,649 మంది ప్రాణాల్ని బలిగొంది. వ్యాక్సిన్ ఇప్పుడిప్పుడే ప్రజలకు అందుతుండడంతో ఈ చీకటి రోజులకు కొత్త సంవత్సరంలో తెరపడనుందన్న ఆశ చిగురిస్తోంది. ఏదేమైనా, ప్రతి ఉపద్రవం వెనుక ఓ పాఠం ఉంటుందన్న చందంగా.. ఈ మహమ్మారి కూడా మనకు చాలా విషయాలు నేర్పింది.
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం
ఈ ఏడాదికి అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ఘనంగా స్వాగతం పలికాయి. 2019 డిసెంబరు చివర్లో ఈ రెండు దేశాల మధ్య రాజుకున్న నిప్పు.. జనవరి 3న ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ హత్యతో తారస్థాయికి చేరుకుంది. ఓ దశలో యుద్ధం తప్పదేమోనన్న విశ్లేషణలు వెలువడ్డాయి. పైగా, ప్రపంచ దేశాలు ఈ విషయంలో రెండుగా చీలిపోయి.. ఒక్కోటి ఒక్కో వర్గానికి మద్దతు ప్రకటిస్తుండడంతో ప్రపంచ యుద్ధమూ రావొచ్చేమోనని కొంతమంది అంచనా వేశారు. అంతదూరం వెళ్లకున్నా.. కొన్ని నెలల పాటు పశ్చిమాసియాలో నెలకొన్న గంభీర వాతావరణం ప్రపంచదేశాల్ని కుదిపేసింది. ఆ తర్వాత ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ రాకెట్ దాడులు చేసింది. ఈ సమయంలో ఉక్రెయిన్‌కు చెందిన విమానాన్ని పొరబాటున నేలకూల్చింది. ఈ ఘటనలో 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చివరికి ఇరాన్ తన తప్పును ఒప్పుకొంది. ఇక ఏడాది చివర్లో ఇరాన్ అణుపితామహుడు మొసిన్ ఫక్రజాదేను దుండగులు హత్య చేశారు. ఈ ఘటనకు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ కారణమని ఇరాన్ ఆరోపించింది.
ఇదీ చూడండి:ట్రంప్‌కే నేరుగా హెచ్చరికలు.. అసలు ఎవరీ సులేమానీ?
శోకంలో ముంచిన కోబీ బ్రయంట్ మరణం
అమెరికన్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ కోబీ బ్రయంట్ మరణం ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులను ఎంతగా కుంగదీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జనవరి 26న ఎన్‌బీయే లెజెండ్ ఇక లేడన్న వార్త యావత్ ప్రపంచాన్ని తీవ్ర విషాదానికి గురిచేసింది. హెలికాప్టర్ ప్రమాదంలో కుమార్తె సహా కోబీ బ్రియంట్ లాస్ ఏంజిలస్‌లో ప్రాణాలు విడిచిన సంఘటన బాస్కెట్‌బాల్ అభిమానుల్ని శోకసంద్రంలో ముంచెత్తింది.
ఇదీ చూడండి:హృదయాల్లో నిలిచి... లోకాన్ని విడిచిన బ్రయంట్
97 మందిని బలిగొన్న విమాన ప్రమాదం
పాకిస్థాన్‌లో మే 22న ఓ పౌరవిమానం కుప్పకూలింది. ప్రముఖ నగరం కరాచీలో అత్యంత రద్దీ ప్రాంతమైన మోడల్ కాలనీలో కూలిన విమానం 97 మందిని బలితీసుకుంది. మొత్తం 99 మంది ప్రయాణికుల్లో కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన అనంతరం పాకిస్థాన్ పైలట్ల శిక్షణపై పలు దేశాలకు అనుమానాలు తలెత్తాయి. దాదాపు 30శాతం మంది పైలట్లకు అసలు అర్హత లేదని తేలింది. 260 మంది వాణిజ్య పైలట్లను పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విధుల నుంచి తప్పించింది.
ఇదీ చూడండి: కరాచీలో విమాన ప్రమాదం- 100మందికిపైగా మృతి
భారత్-చైనా బాహాబాహీ
లద్ధాఖ్ సరిహద్దుల్లో చైనా దురాక్రమణపూరిత వైఖరితో ఈ ఏడాది మే నుంచి భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. డ్రాగన్ బలగాలు ఏకపక్షంగా నిబంధనల్ని ఉల్లంఘిస్తూ తమ పరిధిని దాటి ముందుకు రావడంతో వివాదం ముదిరింది. ఈ క్రమంలో జూన్ 15న గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికులు బాహాబాహీ తలపడ్డారు. ఆ సంఘటనలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. చైనా వైపూ చాలా మందే మరణించారు. అయితే ఆ సంఖ్యను చైనా ఇప్పటికీ వెల్లడించకపోవడం గమనార్హం. 1975 తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణల్లో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. ఈ ఘటన తర్వాత ఇరు దేశాల సైన్యాలు సరిహద్దుల్లో భారీ స్థాయిలో బలగాల్ని మోహరించాయి. ఓ క్రమంలో కీలక ప్రాంతాలపై భారత్ పట్టు సాధించి చైనాకు చుక్కలు చూపింది. దీంతో చేసేది లేక చైనా చర్చలకు దిగి వచ్చింది. ఇంకా ఈ విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ ఘటనపై అప్పట్లో అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చైనా దూకుడు వల్ల సైనిక ఘర్షణ తప్పదేమోనని.. కాలక్రమంలో అది ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం లేకపోలేదన్న విశ్లేషణలు వెలువడ్డాయి.
మరుభూమిగా మారిన బీరుట్
ఆగస్టు 4న లెబనాన్ రాజధాని బీరుట్ భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ ఘటనలో మొత్తం 204 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 8000 మంది గాయపడ్డారు. 15 బిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లినట్లు లెక్కగట్టారు. దాదాపు మూడు లక్షల మందిని ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. ఈ పేలుళ్ల శబ్దం 204 కి.మీ దూరంలో ఉన్న సిప్రస్‌లోనూ వినిపించాయి. అమెరికాలో ఈ పేలుడు ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.3గా నమోదైంది. బీరుట్ ఓడరేవులో ఓ భవనంలో నిల్వ ఉంచిన దాదాపు 1.1 కిలో టన్నుల అమ్మోనియా నైట్రేట్‌ను సరిగ్గా నిర్వహించకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా తేల్చారు. ఇంకా విచారణ జరుగుతోంది.
ఇదీ చూడండి: లెబనాన్ రాజధానిలో భారీ పేలుడు
ఆస్ట్రేలియా కార్చిచ్చు
2019 జూన్‌లో క్వీన్స్‌ల్యాండ్‌లో ప్రారంభమైన ఈ కార్చిచ్చు ఆస్ట్రేలియా చరిత్రలో బ్లాక్ సమ్మర్‌ని మిగిల్చి వెళ్లింది. ఈ మంటలు దాదాపు మే 2020 వరకు కొనసాగాయి. కోట్లాది వన్యప్రాణులు సజీవ దహనమయ్యాయి. బూడిద రూపంలో మిగిలిన కొన్ని జీవుల అవశేషాలకు సంబంధించిన చిత్రాలు అప్పట్లో అందరినీ కలచివేశాయి. ఈ మంటల వల్ల 103 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. దాదాపు 4,60,50,750 ఎకరాల విస్తీర్ణంలో ఈ మంటలు వ్యాపించాయి. దాదాపు 20వేల కట్టడాలు ఆహుతయ్యాయి. 34 మంది ప్రత్యక్షంగా మరణించగా.. 445 మంది పరోక్షంగా ప్రాణాలు కోల్పోయారు.
యావత్తు అమెరికా రోడ్లపైకి
శ్వేతజాతికి చెందిన ఓ పోలీసు కర్కశత్వానికి జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి మరణం అమెరికాలో ప్రకంపనలే సృష్టించింది. ‘‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’’ పేరిట పెద్ద ఉద్యమమే చెలరేగింది. ఆందోళనకారులు ఏకంగా శ్వేతసౌధం ఆవరణలోనే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. వాషింగ్టన్ వీధుల్లో ఈ ఉద్యమం కొన్ని నెలల పాటు కొనసాగింది. కీలక అధికారిక భవనాలపై ఆందోళనకారులు రాళ్లురువ్వడం తీవ్ర చర్చకు దారితీసింది. అనూహ్యంగా అధ్యక్షుడు ఫెడరల్ బలగాల్ని రంగంలోకి దింపారు. ఓ దశలో నిరసనకారుల ఆందోళనలు మిన్నంటడంతో అధ్యక్షుడు శ్వేతసౌధంలోని బంకర్‌లోకి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. తదనంతరం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్ని ఈ ఘటన తీవ్రంగా ప్రభావితం చేసింది. ట్రంప్ ఓటమికి ఇదీ ఓ ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషించారు.
ఇదీ చూడండి:అమెరికాలో 'ఫ్లాయిడ్' నిరసనల వెల్లువ-ప్రపంచవ్యాప్తంగా మద్దతు!
మళ్లీ తెరపైకి ఏలియన్స్
గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించి 2020లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ అబ్జెక్ట్స్(యూఎఫ్‌వో)కు సంబంధించి 2004, 2015లో నేవీ పైలట్లు చిత్రీకరించిన వీడియోల్ని పెంటగాన్ ఏప్రిల్‌లో విడుదల చేసింది. అలాగే ఇటీవల ఇజ్రాయెల్ ఏజేన్సీ చీఫ్ ఏలియన్స్ నిజంగానే ఉన్నాయని పెద్ద బాంబే పేల్చారు. దీనికి సంబంధించిన సమాచారమంతా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు తెలుసని తెలిపారు.
మరో లోకానికి ఫుట్‌బాల్ సమ్మోహనశక్తి
ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా నవంబరు 25న కన్నుమూశారు. అద్భుతమైన ఆటతో ప్రపంచ ఫుట్‌బాల్‌ను సుసంపన్నం చేసిన ఈ మేటి ఆటగాడు గుండెపోటుతో మరణించాడు. కళ్లు చెదిరే విన్యాసాలతో 1986లో అర్జెంటీనాకు ప్రపంచకప్‌ను అందించిన డీగో.. కొకైన్ వాడకం, ఊబకాయంతో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు. మెదడుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. మారడోనా మృతితో అర్జెంటీనా ప్రభుత్వం మూడు రోజులను సంతాప దినాలను ప్రకటించింది.
ఇదీ చూడండి: ఫుట్‌బాల్ దిగ్గజం మారడోనా జీవిత విశేషాలు