తెలంగాణ

telangana

ETV Bharat / international

నిప్పుల కొలిమిలో భూగ్రహం-ముందుంది మరింత దారుణం! - global warming

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దశాబ్దంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) తెలిపింది. దశాబ్దంలో మూడో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరంగా 2019 రికార్డు సృష్టించింది. మానవాళి తట్టుకునే సామర్థ్యానికి మించి సంభవిస్తున్న వాతావరణ మార్పులపై వార్షిక నివేదిక వెలువరించిన వాతావరణ సంస్థ.. పలు ఆందోళనకర విషయాలను వెల్లడించింది.

2010s hottest decade in history, UN says as emissions rise again
నిప్పుల కొలిమిలో భూగ్రహం-ముందుంది మరింత దారుణం!

By

Published : Dec 3, 2019, 6:14 PM IST

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దశాబ్దంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. వాతావరణ మార్పులకు సంబంధించి ప్రపంచ వాతావరణ సంస్థ(ఐరాస అనుబంధ సంస్థ) ఈమేరకు వార్షిక నివేదిక విడుదల చేసింది. ఇందులో పలు ఆందోళనకర విషయాలను వెల్లడించింది.
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని నివేదిక స్పష్టం చేసింది. వ్యర్థాలు తగలబెట్టడం, భవన నిర్మాణాల దుమ్ముధూళి, పంట వ్యర్థాలను కాల్చివేయడం వంటి అంశాలు 2019లో అధిక ఉష్ణోగ్రతలకు కారణమయ్యాయని వివరించింది. దశాబ్దంలోనే మూడో అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ ఏడాదిలో నమోదైనట్లు పేర్కొంది. పారిశ్రామిక విప్లవానికి ముందు పరిస్థితులతో పోలిస్తే 1.1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగినట్లు తెలిపింది.

వేడెక్కిన సముద్రం

కర్భన ఉద్గారాల పెరుగుదలతో సముద్రాలలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వెల్లడించింది ప్రపంచ వాతావరణ సంస్థ. సముద్రాలలో ఉన్న ఆమ్ల శాతం 150 ఏళ్ల క్రితంలో పోలిస్తే పావు శాతం అధికమైనట్లు లెక్కగట్టింది. ఫలితంగా సమద్ర వేటపై ఆధారపడే ప్రజల జీవితం అగమ్యగోచరంగా మారిందని తెలిపింది. అక్టోబర్​లో సముద్ర మట్టం సగటు జీవితకాల గరిష్ఠానికి చేరుకుని.... కేవలం 12 నెలల వ్యవధిలో గ్రీన్​లాండ్​లోని 329 బిలియన్ టన్నుల మంచు కరిగి సముద్రంలో కలిసిపోయినట్లు వివరించింది.

కోట్ల మందిపై ప్రభావం

గత నాలుగు దశాబ్దాలు... అంతకుముందు దశాబ్దాలతో పోలిస్తే అధిక ఉష్ణోగ్రతలు నమోదు చేసినట్లు పేర్కొంది. ఈ పరిణామాలు భవిష్యత్​ తరాలు అదుపుచేయలేని విధంగా ఉంటాయని హెచ్చరించింది. మానవుల అత్యాశ, నిరంతర అభివృద్ధి కాంక్ష వల్ల లక్షలాది మంది ప్రమాద బారిన పడ్డారని తెలిపింది. 2019 తొలి అర్ధభాగంలో కోటి మందికి పైగా అంతర్గతంగా స్థానచలనం చెందినట్లు నివేదిక తెలిపింది. వరదలు, కరవు, తుపాను వంటి కారణాల వల్ల 70 లక్షల మంది తమ ప్రాంతాలను వదిలి వెళ్లారని వెల్లడించింది.

"2019లో కూడా వాతావరణ సంబంధిత ప్రమాదాలు తీవ్రమైన ప్రభావం చూపాయి. వందేళ్లకోసారి సంభవించే వరదలు, వడగాలులు ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి."
-పెట్టెరి తలాస్, ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యదర్శి

ముందున్న కర్తవ్యం?

ఈ నేపథ్యంలో భూతాపాన్ని 2 డిగ్రీల సెంటిగ్రేడ్​కు తగ్గించడానికి ఉద్దేశించిన పారిస్ వాతావరణ ఒప్పందాన్ని పక్కాగా అమలు చేయడం అత్యావశ్యకం. 2015లో రూపొందించిన పారిస్ ఒప్పంద నియమాలకు తుది మెరుగులు దిద్దే ప్రయత్నంలో ఉన్నాయి ప్రపంచ దేశాలు. అయితే పారిస్ ఒప్పందంలో ఉన్న వాగ్దానాలను అన్ని దేశాలు తూ.చ తప్పకుండా అమలు చేసినప్పటికీ ఈ శతాబ్ద చివరినాటికి భూతాపం 3 డిగ్రీల కన్నా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కర్బన ఉద్గారాల విడుదలను సంవత్సరానికి 7.6శాతం చొప్పున తగ్గించగలిగితే 2030 నాటికి భూతాపాన్ని 1.5 సెంటీగ్రేడ్ వరకు తీసుకురావచ్చని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేస్తోంది. అయితే కర్బన ఉద్గారాలు ఏటికేడు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details