ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో.. వారం రోజుల ముందే రాజధాని వాషింగ్టన్ ఆంక్షల వలయంలోకి జారుకుంది. నగరంలో బుధవారమే లాక్డౌన్ విధించారు. ప్రమాణస్వీకార మహోత్సవం జరిగే క్యాపిటల్ వద్ద భారీస్థాయిలో కంచెలు నిర్మిస్తున్నారు. వాహనాలకు అనుమతులివ్వడం లేదు.
ప్రమాణస్వీకార మహోత్సవంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకునేందుకు 20వేల మంది నేషనల్ గార్డ్స్‌ను ఆయుధాలతో క్యాపిటల్ చుట్టూ మోహరిస్తోంది అగ్రరాజ్య రక్షణ విభాగం పెంటగాన్. ఇప్పటికే 15 వేల మంది క్యాపిటల్ వద్దకు చేరుకున్నారు. ఈ నెల 20లోపు మరో 5వేల మంది వేదిక ప్రాంగణం వద్దకు చేరుకుంటారు.
క్యాపిటల్ ఎఫెక్ట్..
ఇంతటి భారీ స్థాయిలో బలగాలను మోహరించడానికి ముఖ్య కారణం.. ఈ నెల 6న క్యాపిటల్ భవనం వద్ద జరిగిన హింసాకాండ. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన వేలాది మంది మద్దతుదారులు.. క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించారు. ఆ సమయంలో.. బైడెన్ ప్రమాణస్వీకారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా అడ్డుకుంటామని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇదీ చూడండి:-'బైడెన్ ప్రమాణస్వీకారం రోజు అమెరికాలో అల్లర్లు!'