అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల ప్రచారం కారణంగా 30వేల మంది కొవిడ్ బారినపడ్డారని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అంచనావేశారు. వీరిలో కనీసం 700 మంది వరకు మరణించి ఉంటారని పేర్కొన్నారు. ప్రధానంగా ట్రంప్ ర్యాలీలు నిర్వహించిన కమ్యూనిటీలు కొవిడ్ వ్యాప్తిపరంగా భారీ మూల్యం చెల్లించుకొన్నాయని తెలిపారు. 'ది ఎఫెక్ట్ ఆఫ్ లార్జ్ గ్రూప్ మీటింగ్స్ ఆన్ ది స్ప్రెడ్ ఆఫ్ కొవిడ్-19: ది కేస్ ఆఫ్ ట్రంప్ ర్యాలీస్' అనే అంశంపై వారు పరిశోధనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జూన్ 20 నుంచి సెప్టెంబర్ 22 మధ్య ట్రంప్ నిర్వహించిన 18 ర్యాలీల ప్రభావాన్ని పరిశీలించారు. చివరికి ఈ ప్రదేశాల్లో 30,000 కేసులు ఎక్కువ వచ్చినట్లు గుర్తించారు. వీరిలో దాదాపు 700 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనావేశారు. వీరిలో నేరుగా ట్రంప్ ర్యాలీలకు హాజరుకాని వారు కూడా ఉన్నారన్నారు. భారీగా జనం గుంపులుగా చేరడం కొవిడ్ వ్యాప్తికి కారణం అవుతుందన్న ప్రజారోగ్య విభాగం సూచనలను సమర్థిస్తామని పరిశోధకులు పేర్కొన్నారు. ముఖ్యంగా మాస్కులు వాడకుండా భౌతిక దూరం పాటించకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.