పర్యావరణం పట్ల మానవాళి అలక్ష్యం- పెనుముప్పునకు కారణభూతమవుతోంది. గతంతో పోలిస్తే ఈ సంవత్సరంలో ఉత్తరార్ధగోళంలో చలిగాలులు చాలా ఎక్కువగా ఉన్నాయని, వాటికి గాలిలో కలుస్తున్న ప్రమాదకర రసాయనాలు తోడై- ఓజోన్ పొర దెబ్బతింటోందని పరిశోధకులు చెబుతున్నారు. భారతదేశానికి దాదాపు ఎనిమిది రెట్లు అధిక పరిమాణంలో ఓజోన్ పొరకు చిల్లి పడినట్లు అమెరికాకు చెందిన నాసా, నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (నోవా) శాస్త్రవేత్తలు ఇటీవల వెల్లడించారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా నిగ్గుతేల్చిన వివరాల ప్రకారం- ఓజోన్ రంధ్రం పరిమాణం ప్రస్తుతం 2.48 కోట్ల చదరపు కిలోమీటర్ల స్థాయికి చేరింది. అంటార్కిటికా ప్రాంతంలో విపరీతంగా తగ్గిపోయిన ఉష్ణోగ్రతలు, గాలులు దీనికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు సూత్రీకరిస్తున్నారు. ఏటా ఆగస్టు నుంచి అక్టోబరు వరకు దక్షిణార్ధ గోళంలో అంటార్కిటికా మీదుగా ఓజోన్ రంధ్రం విస్తరిస్తోంది. సెప్టెంబరు మధ్య నుంచి అక్టోబరు మధ్యనాటికి అది గరిష్ఠ స్థాయికి చేరుతుంది. ఆ సమయంలోనే మనుషులు వివిధ సాధనాల ద్వారా విడిచిపెట్టే క్లోరిన్, బ్రోమైన్ సంబంధిత రసాయనాలు బాగా ఎత్తులో ఉండే ధ్రువ మేఘాల్లోకి వెళ్లి, వాటితో చర్యలు జరుపుతాయి. అవి ఓజోన్ రంధ్రాన్ని మరింతగా పెంచుతాయి. దాని పరిమాణాన్ని శాస్త్రవేత్తలు ఏటా కొలుస్తూ, నమోదు చేస్తుంటారు.
సాధారణంగా ఓజోన్ రంధ్రం భారీ పరిమాణంలో కొంతకాలమే ఉంటుంది. వేసవి వచ్చేకొద్దీ రంధ్రం క్రమంగా పూడుకుపోతూ, కొంతమేర సాధారణ స్థాయికి చేరుతుంది. ఈసారి మాత్రం అలా జరగడం లేదు. ఆ రంధ్రం ఒకే స్థాయిలో ఉండటం లేదా మరింత పెరగడం కనిపిస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటివరకు నమోదైన సగటు ఓజోన్ రంధ్రం స్థాయి కంటే ప్రస్తుత పరిమాణం చాలా అధికమని వారు చెబుతున్నారు. ఓజోన్ పొరకు నష్టం చేసే క్లోరోఫ్లోరో కార్బన్ల(సీఎఫ్‌సీల)ను విడుదల చేయడాన్ని మాంట్రియల్ ప్రొటోకాల్ నిషేధించింది. అప్పటి నుంచి ఓజోన్ పొర పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది. రెండు దశాబ్దాల క్రితం స్థాయిలోనే ఇప్పటికీ సీఎఫ్‌సీలు విడుదలవుతుంటే- ఓజోన్ రంధ్రం పరిమాణం మరో 40 చదరపు కిలోమీటర్లు ఎక్కువగా ఉండేదని నాసా పేర్కొంది.
అంతర్జాతీయ వాతావరణ సంస్థ (డబ్లూఎంఓ) సైతం ఓజోన్ రంధ్రంపై పరిశోధనలు చేసింది. గత దశాబ్ద కాలంలో కనీవినీ ఎరగనంత స్థాయిలో ఈసారి ఓజోన్ రంధ్రం ఉందని డబ్ల్యుఎంఓ అంతర్జాతీయ వాతావరణ పరిశీలన కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. 2019 సంవత్సరంలో ఓజోన్ పొరకు చాలా చిన్న పరిమాణంలో చిల్లి పడి, అత్యంత తక్కువ కాలం పాటే కొనసాగింది. మాంట్రియల్ ప్రొటోకాల్‌ను కొన్ని దేశాలు ఉల్లంఘించడంతో ఈసారి రంధ్రం పెద్దది కావడంతో పాటు, ఎక్కువ కాలం కొనసాగుతోంది. సీఎఫ్‌సీలపై నిషేధం విధించి, దాన్ని కచ్చితంగా అమలుచేసినప్పుడు ఓజోన్ పొర క్రమంగా కోలుకుంటూ వచ్చింది. చైనా వంటి దేశాలు సీఎఫ్‌సీల విడుదల విషయంలో ఇటీవల నియంత్రణ పాటించడం లేదు. దాంతో ఓజోన్ పొర తీవ్రంగా దెబ్బతింటోంది. వాతావరణంలోకి సీఎఫ్‌సీ-11 వాయువు విడుదల వల్లే ఓజోన్ పొరకు భారీస్థాయిలో చిల్లి పడుతోంది. సీఎఫ్‌సీ-11 నుంచి వెలువడే వేడి ప్రతి సంవత్సరం 16 బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు వెలువరించే బొగ్గుపులుసు వాయువు(కార్బన్ డయాక్సైడ్)తో సమానం! విద్యుత్ వాడకాన్ని తగ్గించేందుకు ఇన్సులేషన్‌లో ఉపయోగించే పాలీయురేథేన్ ఫోమ్ తయారీలో సీఎఫ్‌సీ-11 బాగా అక్కరకొస్తుంది. అందుకే చైనాలో ఇళ్ల నిర్మాణంలో దాన్ని విరివిగా ఉపయోగిస్తారు. ఆ దేశంలో దాదాపు పది రాష్ట్రాల్లో సీఎఫ్‌సీ-11ను ఎక్కువగా వాడుతున్నట్లు పర్యావరణ పరిశోధన సంస్థ (ఈఐఏ) గతంలో గుర్తించింది. ఈ వాయువును 2010లోనే నిషేధించినా, చైనాలో మాత్రం దాన్ని విచ్చలవిడిగా వినియోగిస్తుండటం వల్లే ఓజోన్ పొర చిక్కిశల్యమవుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఉత్పత్తయ్యే పాలీయురేథేన్ ఫోమ్‌లో మూడోవంతు చైనా నుంచే వస్తోంది. దాన్ని డ్రాగన్ కట్టడి చేయకపోతే మొత్తం మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమ్మీదకు వస్తే వాటిల్లే నష్టం అపారం. అలా రాకుండా కాపాడే ఓజోన్ పొరను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలన్నింటి మీదా ఉంది. మన చర్యలతో ఓజోన్ రంధ్రం పరిమాణాన్ని పోనుపోను విస్తృతం చేసుకుంటూ వెళ్తే- దానివల్ల ఎదురయ్యే విపరిణామాలను ఎదుర్కోవడం ఎవరివల్లా కాదు. ఈ కఠోర వాస్తవాన్ని అన్ని దేశాలూ... ముఖ్యంగా చైనా గుర్తించి తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
- రఘురామ్
ఇదీ చూడండి:చైనాలో మంచు తుపాను.. వావ్ అనిపించేలా ప్రకృతి అందాలు