అమెరికాపై కరోనా పంజా- 24గంటల్లో 10వేల కేసులు కరోనా మహమ్మారితో అమెరికా హడలెత్తిపోతోంది. కేసుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరిగిపోతోంది. ఆ దేశంలో సోమవారం ఒక్కరోజే 139మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. దీని వల్ల మృతుల సంఖ్య 550కు చేరింది. 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 10వేల మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 20,875కు పెరిగింది.
ఈ నేపథ్యంలో ఔషధ సరఫరా, వైద్య పరికరాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. శానిటైజర్లు, మాస్కులను అధిక రేట్లకు విక్రయిస్తే ఉపేక్షించేది లేదని వ్యాపారులను హెచ్చరించారు. స్వలాభంతో అమెరికా పౌరులకు ఇబ్పంది తలపెట్టొద్దని తేల్చి చెప్పారు.
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. సోమవారం కొత్తగా 5,085మంది వైరస్ బారిన పడ్డారు. ఆ నగరంలో ఇప్పటి వరకు 43మంది ప్రాణాలు కోల్పోయారు.
సెనెటర్‌కు కరోనా పాజిటివ్..
కెంటకీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సెనెటర్ ర్యాండ్ పాల్(57).. కరోనా సోకినట్లు సోమవారం నిర్ధరణ అవడం తోటి సెనెటర్లను కలవరానికి గురి చేస్తోంది. అతనితో సన్నిహితంగా మెలిగిన పులువురు సెనెటర్లు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కరోనా పాజిటివ్‌గా తేలే ముందు వరకు కార్యాలయంలో యథావిధిగా విధులు నిర్వర్తించారు పాల్. ట్రంప్ ప్రతిపాదించిన కరోనా ప్యాకేజీపైనా ఇతర సెనేటర్లతో చర్చించారు. అయితే తనలో కరోనా లక్షణాలు కనపడలేదని.. అయినా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని వెల్లడించారు పాల్. అందుకే కార్యలయంలో విధులను నిర్వర్తించినట్లు వివరించారు. కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తులను కలవలేదని, బహుశా సమావేశాలకు వెళ్లినప్పుడు సమూహంలో ఎవరి నుంచైనా సోకి ఉండవచ్చని చెప్పారు. ప్రతినిధుల సభలో అప్పటికే ఇద్దరికి కరోనా సోకిందని గుర్తుచేశారు. అందువల్ల స్వీయనిర్బంధంలోకి వెళ్లలేదని తనను విమర్శించడం సరికాదన్నారు పాల్.