అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాక చైనా వస్తువులపై సుంకాలు పెంచి ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి తెర తీశారు డొనాల్డ్ ట్రంప్. అప్పటి నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య పోరు జరుగుతూనే ఉంది.
సెప్టెంబరు 1నుంచి చైనా వస్తువులపై మరోసారి సుంకాల మోత మోగించనున్నారు ట్రంప్. ఈ చర్యతో చైనా నుంచి 13 శాతం కంపెనీలు తిరుగుముఖం పడతాయని జోస్యం చెప్పారు. శ్వేతసౌధంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
సుంకాల పెంపును చైనాలోని కంపెనీలు భరించలేవన్నారు ట్రంప్. ఆ దేశం నుంచి వెళ్లిపోయే కంపెనీల సంఖ్య 13శాతం దాటినా ఆశ్యర్యపోనవసరం లేదని అభిప్రాయపడ్డారు. తాము నూతనంగా విధించే సుంకాలతో చైనా కంపెనీలు పోటీలో నిలబడలేవని స్పష్టం చేశారు.