అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. అయితే భారతీయ ఓటర్లు అధ్యక్షుడు ట్రంప్‌వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. భారతీయులను గౌరవిస్తూ, ప్రధాని మోదీని నిజమైన స్నేహితుడిగా చెబుతూ సాగుతోంది ట్రంప్ ప్రచార వ్యూహం. ఇది రిపబ్లికన్లు-డెమోక్రాట్ల మధ్య గట్టి పొటీ నెలకొన్న కొన్ని రాష్ర్టాల్లో భారతీయ ఓటర్లను ఆకర్షిస్తోందంటోంది సర్వే.
భారత్ పరపతి పెంచేలా అడుగులు
అల్ మసన్ నేతృత్వంలోని.. ట్రంప్ విక్టరీ ఇండియన్ అమెరికన్ ఫైనాన్స్ కమిటీ నిర్వహించిన ఈ సర్వే మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రధానంగా ట్రంప్ ప్రభుత్వం.. గత అమెరికన్ ప్రభుత్వాల్లాగా భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవటం కలిసొచ్చిందంటోంది ఈ నివేదిక. కశ్మీర్ విషయంలో ట్రంప్ వైఖరి, అదే సమయంలో అంతర్జాతీయంగా భారత్ పరపతి పెంచేలా ఆయన అడుగులు కీలకంగా నిలిచాయంటోంది.
అయితే, అన్నింటికన్నా ప్రభావితంగా నిలుస్తోంది మాత్రం.. ట్రంప్-మోదీ మైత్రి బంధమేనంటోంది. ప్రపంచ యవనికపై చైనాకు చెక్ పెట్టాలంటే.. ఈ జోడీ మరో నాలుగేళ్లు కొనసాగాలని భారతీయ-అమెరికన్లు కోరుకుంటున్నట్లు తేల్చింది ఈ సర్వే.
చైనాపై ట్రంప్ వైఖరి
ట్రంప్‌నకు భారతీయుల మద్దతు వెనక.. మరో ముఖ్యమైన అంశం చైనాపై ట్రంప్ వైఖరి. యుద్ధమేఘాలు కమ్ముకున్నా ట్రంప్ సంయమనం పాటిస్తుండటమే ఇందుకు కారణం. కరోనా విలయానికి ముందు శాంతియుతంగా అమెరికన్ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టిన తీరుకు.. ఇండియన్-అమెరికన్లు మంత్రముగ్ధులయ్యారంటోంది ఈ సర్వే.
ట్రంప్-మోదీ మైత్రి
ట్రంప్ అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రతిష్ఠ పెంచారు. అమెరికాతో దోస్తీ విధానాలతో ప్రధాని నరేంద్ర మోదీ సైతం స్నేహహస్తం చాచారంది సర్వే. ప్రస్తుతం భారత్-అమెరికా సంబంధాలు బలమైన బంధంగా నిలిచాయని.. ట్రంప్-మోదీ కలిసికట్టుగా తీసుకుంటున్న నిర్ణయాలు.. ఇరుదేశాలకు మరింత మేలు చేస్తున్నాయని స్పష్టం చేస్తోంది.
అలాగే, అమెరికాలో ఉంటున్న ప్రతి భారతీయుడికి స్వదేశంలో కుటుంబ సభ్యులో, వ్యాపారాలో ఉంటాయి. సరిహద్దులో ఉద్రిక్తితల నేపథ్యంలో వారు చైనా నుంచి తమవారికి రక్షణ కోరుకుంటారు. ఆ నమ్మకం ట్రంప్ ఇవ్వగలరని భావిస్తున్నారని, అదే సమయంలో అధ్యక్షుడిగా ట్రంప్ లేకపోతే చైనా.. భారత్‌పైకి యుద్ధానికి వెనకాడదని చెబుతోంది సర్వే నివేదిక. ఇది అధ్యక్షుడు ట్రంప్ వెంటే భారతీయ ఓటర్లు నడిచేందుకు తోడ్పడుతుందని పేర్కొంది.