అమెరికాలో శాశ్వత నివాసానికి అవకాశం కల్పించే గ్రీన్‌కార్డు చాలామందికి చిరకాల వాంఛ! వేలమంది భారతీయులు ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న వారు ఈ గ్రీన్‌కార్డుల కోసం కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. అత్యంత విలువైన ఆ కార్డులు... ఈసారి లక్ష దాకా వృథా కాబోతున్నాయి! అంటే లక్ష మందికి గ్రీన్‌కార్డు హోదా పొందే అవకాశం కోల్పోబోతున్నారు. కొవిడ్, తదనంతరం అమెరికా ఇమ్మిగ్రేషన్‌లో నత్తనడకన సాగుతున్న పనులే ఇందుకు కారణం!
అమెరికాలో చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ వ్యహారాలు చూసే బాధ్యత సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ సంస్థ (యూఎస్‌సీఐఎస్)ది. 2020 అక్టోబరులో లక్షా 20వేల గ్రీన్‌కార్డుల జారీకి ఈ సంస్థ తన వార్షిక పని ఆరంభించింది. ఈ సెప్టెంబరుతో ఈ ఏడాది పని పూర్తి అవుతుంది. అప్పటిదాకా ఎన్ని గ్రీన్‌కార్డులు జారీ చేస్తే అన్ని ఈ ఏడాది కోటాలో పూర్తయినట్లు లెక్క. మిగిలినవన్నీ వృథా అయినట్లే! ఇప్పటిదాకా ఎన్నింటిని పూర్తి చేశారనేదానిపై కచ్చితమైన అధికారిక లెక్కలు లేకపోయినా... జులైలో ఇచ్చిన ఇంటర్వ్యూలో... విదేశాంగ శాఖ అధికారి చార్లీ ఓపెన్‌హీమ్ చెప్పిన సంగతి చాలామంది అమెరికా ఆశావహులకు ఆశనిపాతంలా తాకింది. ఈ సెప్టెంబరు చివరి నాటికి... సుమారు లక్ష గ్రీన్‌కార్డులు ఇంకా పెండింగ్‌లో ఉండిపోతాయని చార్లీ స్పష్టం చేశారు. అంటే సెప్టెంబరు చివరినాటికి వాటిని జారీ చేయకుంటే మురిగిపోయినట్లే లెక్క! ఈసారి గ్రీన్‌కార్డు అవకాశం వచ్చీ... చేజారిన వారు వచ్చే ఏడాది కోటాలో వరుసలో ముందర ఉండరు. మళ్ళీ వారికి అవకాశం రావటానికి కనీసం ఐదేళ్ళయినా పట్టొచ్చని ఓ న్యాయవాది వ్యాఖ్యానించారు.