లాటిన్ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్‌లో కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం కరోనాను కట్టడి చేయలేక చేతులెత్తేయగా.. కేసులు విపరీతంగా పెరుగతున్నాయి. బాధితుల సంఖ్య పెరగడం వల్ల శవాగారాలు, శ్మశాన వాటికల్లోనూ స్థలం సరిపోవట్లేదు. రియోడిజెనీరో నగరంతో పాటు మరో నాలుగు ప్రధాన నగరాల్లో ఇప్పటికే అన్ని ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి.
దేశంలో నెలకొన్న ఈ పరిస్థితి సహా అధ్యక్షుడు జైర్ బోల్సోనారో తీరుకు వ్యతిరేకంగా ఓ వినూత్న నిరసన తెలిపింది ఓ ఎన్జీఏ సంస్థ. ఇందులో ప్రజలు భాగస్వాములయ్యారు.
ఒకప్పుడు ఒలింపిక్స్ నిర్వహించిన రియోడిజెనీరో ప్రాంతంలోని బీచ్ వద్ద 100 సమాధులను తవ్వి.. మహమ్మారి బాధితులకు సంతాపం తెలిపారు. ఇది బ్రెజిల్‌లోని 'విలా ఫార్మోసా' శ్మశానవాటికలో పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.