అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అభిశంసన చిక్కులు తప్పేలా లేవు. గత నెలలో డెమొక్రటిక్ పార్టీ సెనెటర్, ఆశావాహ అధ్యక్ష అభ్యర్థి ఎలిజబెత్ వారెన్ అభిశంస ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. తాజాగా కొంత మంది సామాజిక కార్యకర్తలు అధ్యక్షుడికి వ్యతిరేకంగా కోటి మంది సంతకాలు సేకరించారు. ఈ దస్త్రాలను కాంగ్రెస్‌కు సమర్పించారు. ట్రంప్ అభిశంసనకు చట్టసభ్యులు చర్యలు చేపట్టాలని అభ్యర్థించారు. ఇందుకు రెండు సభల డెమొక్రాట్లు మద్దతు ప్రకటించారు.
రష్యా జోక్యంపై...
ట్రంప్ అభిశంసనకు డిమాండ్ చేయడానికి కారణాల్లో... రష్యా అంశం ఒకటి. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై రాబర్ట్ మ్యూలర్ నివేదికలో తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని స్పష్టమైందని ప్రకటించారు ట్రంప్. కానీ అధ్యక్షుడు విచారణను అడ్డుకున్నారని కొంతమంది డెమొక్రాట్లు ఆరోపించారు. రష్యా వ్యవహారంలో అనుమానాలు వ్యక్తంచేస్తూ ఇటీవలే ఎలిజబెత్ వారెన్ అభిశంసన ప్రతిపాదన తెచ్చారు.