అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి రికార్డు స్థాయిలో ముందస్తు ఓటింగ్ నమోదైంది. దాదాపు 10 కోట్ల మంది ముందస్తుగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ రోజు మరో 6 కోట్ల మంది ఓటింగ్‌కు తరలిరానున్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో మొత్తంగా 16 కోట్ల మంది ఓటర్లు అమెరికా అధ్యక్ష ఎన్నికలో పాల్గొన్నట్లు అవుతుంది.
ఇది మొత్తం ఓటర్లలో 67 శాతమని అంచనా వేశారు ఫ్లోరిడా యూనివర్సిటీ అనుబంధ ఆచార్యులు మైఖేల్ పీ మెక్‌డొనాల్డ్. ఈ స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు కావడం 1900 సంవత్సరం తర్వాత ఇదే తొలిసారి అవుతుందని పేర్కొన్నారు.
"మంగళవారం ఉదయం నాటికి సుమారు పది కోట్ల ఓట్లు పోలవుతాయని తెలుస్తోంది. ఓటర్ టర్నోవర్ 2016తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో గత ఎన్నికల ఓటింగ్ రికార్డు బద్దలైంది."
-మైఖేల్ పీ మెక్‌డొనాల్డ్, ఫ్లోరిడా యూనివర్సిటీ అనుబంధ ఆచార్యులు
హవాయి, టెక్సాస్, మోంటనా రాష్ట్రాల్లో 2016తో పోలిస్తే ఓటర్ టర్నవుట్ దాటిపోయింది. ఉత్తర కరోలినా, జార్జియా, న్యూ మెక్సికో, నెవాడా, టెన్నెస్సీ రాష్ట్రాల్లో గత ఎన్నికలతో పోలిస్తే 90 శాతం ఓటింగ్ నమోదైంది.
గత రెండు ఎన్నికల్లో ముందస్తు ఓటింగ్ డెమొక్రాట్లకు అనుకూలంగా ఉన్నట్లు తేలిందని మెక్‌డొనాల్డ్ తెలిపారు. 2016తో పోలిస్తే ప్రస్తుత ముందస్తు ఓటింగ్‌లో మార్పు కనిపించిందని చెప్పారు. ఇది డెమొక్రాట్లకు కలిసొచ్చే అవకాశం ఉందని చెప్పారు. అయితే గతంలో హోరాహోరీ పోరు జరిగిన ఫ్లోరిడా, ఉత్తర కరోలినాలో ఈసారి కూడా పరిస్థితి అలాగే ఉంటుందని అభిప్రాయపడ్డారు.
"ప్రతీ రాష్ట్రంలో ఓటర్ టర్నోవర్‌ను అంచనా వేసి, జాతీయ స్థాయిలో మదింపు వేసినప్పుడు.. మొత్తం ఓటర్ల సంఖ్య 16.02 కోట్లుగా ఉంటుందని లెక్కించాను. ఇది అర్హులైన మొత్తం ఓటర్లలో 67 శాతం."