భారత్‌లో అందుబాటులోకి వచ్చిన కొవాగ్జిన్ టీకా తమ దేశంలో అత్యవసర వినియోగం కింద పంపిణీ చేసేందుకు ఆఫ్రికా దేశం జింబాబ్వే ఆమోదం తెలిపింది. దీంతో సాధ్యమైనంత తొందరగా కొవాగ్జిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని జింబాబ్వేలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. కొవాగ్జిన్ టీకా 81శాతం సమర్థత కలిగినట్లు భారత్ బయోటెక్ ప్రకటించిన మరుసటి రోజే జింబాబ్వే అనుమతించింది. దీంతో ఆఫ్రికాలో కొవాగ్జిన్‌ను ఆమోదించిన తొలి దేశంగా జింబాబ్వే నిలిచింది.
భారత్‌లో వ్యాక్సిన్ పంపిణీ చేయడం సహా.. ఇతర దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేయడంలో భారత్ ముందుంది. ఇక్కడ తయారవుతోన్న కొవిడ్ వ్యాక్సిన్ కోసం స్వల్ప, మధ్య ఆదాయ దేశాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఇందులో భాగంగా సీరం ఇన్‌స్టిట్యూట్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాక్సిన్‌ను ఎగుమతి చేస్తోంది. భారత్ బయోటెక్ కూడా 40దేశాల్లో అనుమతి కోసం దరఖాస్తులు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే బ్రెజిల్, యూఏఈ వంటి దేశాల్లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ప్రకటించింది. ఇక.. అమెరికాలోనూ కొవాగ్జిన్‌ను పంపిణీ చేసేందుకు అక్కడి ఔషధ సంస్థ ఆక్యూజెన్‌తో భారత్ బయోటెక్ ఒప్పందం చేసుకుంది.