ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. కొత్తకొత్త వేరియంట్లు(corona variants) పుట్టుకొస్తూ.. ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి. భారత్‌లో డెల్టా వేరియంట్ సృష్టించిన బీభత్సం ఎంతటిదో మనందరికీ తెలుసు. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్(South african variant).. భారత్‌తో పాటు అన్ని దేశాలను కలవరపెడుతోంది. ఈ వేరియంట్ కారణంగా మన దేశంలో థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అసలేంటీ కొత్త వేరియంట్? ఇది డెల్టా కంటే డేంజరా?
కొత్త వేరియంట్ ఏంటి?
దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఈ వేరియంట్‌ను బి.1.1.529గా(b.1.1.529 variant) శాస్త్రవేత్తలు గుర్తించారు. దక్షిణాఫ్రికాతో పాటు, హాంకాంగ్, బోత్స్వానాలో ఇప్పటివరకు 50 కొత్త వేరియంట్ కేసులు నిర్ధరణ అయ్యాయి.
ఎందుకు అంత భయం?
బి.1.1.259 చాలా అసాధారణమైన వైరస్ ఉత్పరివర్తనాల(new coronavirus variant mutation) కలయిక అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది శరీర రోగ నిరోధక శక్తిని ఏమార్చి, విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్పారు. ఈ వేరియంట్‌కు గనుక వ్యాక్సిన్ల నుంచి తప్పించుకోగల లేదా డెల్టా వేరియంట్ కంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం ఉంటే.. ప్రపంచానికి పెను ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.
దక్షిణాఫ్రికాలో ఎక్కడ బయటపడింది?
దక్షిణాఫ్రికాలోని గౌతెంగ్ ప్రావిన్సులో ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోందని అక్కడి వైద్య నిపుణులు చెబుతున్నారు. దాంతో పాటు దేశంలోని ఎనిమిది ఇతర ప్రావిన్సుల్లోనూ ఈ వేరియంట్ వ్యాప్తి చెంది ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
దక్షిణాఫ్రికాలో కొత్త కేసులు పెరిగాయా?
తమ దేశంలో కొత్తగా 2,465 కరోనా కేసులు నమోదయ్యాయని దక్షిణాఫ్రికా వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇది క్రితం రోజు నమోదైన కేసుల సంఖ్య కంటే రెట్టింపు కావడం గమనార్హం. అయితే.. ఈ కేసుల పెరుగుదలకు కారణం కొత్త వేరియంటే అని వారు మాత్రం చెప్పలేదు. కానీ, స్థానిక శాస్త్రవేత్తలు వైరస్ కేసుల పెరుగుదలకు కారణం కొత్త వేరియంటేనని అంటున్నారు. దక్షిణాఫ్రికాలోని గౌతెంగ్ ప్రావిన్సులో నమోదైన మొత్తం కేసుల్లో 90శాతం కేసులకు కారణం ఈ వేరియంటేనని శాస్త్రేవేత్తలు చెబుతున్నారు.
ఇతర దేశాల్లో పరిస్థితి ఏంటి?
దక్షిణాఫ్రికాతో పాటు బోత్స్వానా, హాంకాంగ్‌లోనూ ఈ కేసులు వెలుగు చూశాయి. దక్షిణాఫ్రికా నుంచి ఓ వ్యక్తి తమ దేశంలోకి రావడం వల్లే హాంకాంగ్‌లో ఈ కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూశాయని అక్కడి అధికారులు అనుమానిస్తున్నారు.
ఇతర వేరియంట్లకు, ఈ కొత్త వేరియంట్‌కు తేడా ఏంటి?