Uganda Schools Reopen: కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పాఠశాలలు మూతపడి ఇటీవల మళ్లీ ప్రారంభమయ్యాయి. అయితే పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి ఆఫ్రికా దేశమైన ఉగాండా రికార్డ్ సృష్టించింది. కొవిడ్ కారణంగా ఉగాండాలోని పాఠశాలలకు దాదాపు 83 వారాలు అంతరాయం ఏర్పడింది. మహమ్మారి ప్రభావంతో సుదీర్ఘ కాలం పాఠశాలలు మూతపడ్డ దేశంగా నిలిచింది. అయితే తాజాగా దేశవ్యాప్తంగా పాఠశాలల పునఃప్రారంభానికి ఆదేశాలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం.
సోమవారం నుంచి పాఠశాలలు మళ్లీ ప్రారంభమయ్యాయి. విద్యార్థులు అందరూ బడి బాట పట్టారు. దీంతో ఆ దేశ రాజధాని అయిన కంపాలాలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కానీ ఇటీవల ఆ దేశంలో మరోసారి ఆందోళనకర స్థాయిలో కరోనా కేసులు నమోదుకావడం వల్ల ఈ పాఠశాలలు ఎంతకాలం కొనసాగుతాయనే విషయం ఆసక్తికరంగా మారింది.
నేపాల్‌లో బంద్..
కరోనా కారణంగా నేపాల్‌లో పాఠశాలలు మూతపడ్డాయి. ఈనెల 31 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని విద్యాశాఖ ప్రకటించింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
స్వీడన్లో ఆంక్షలు..
కరోనా ఆంక్షలను కట్టుదిట్టం చేసింది స్వీడన్. కేఫ్, బార్లు, రెస్టారెంట్లకు రాత్రి 11 వరకే అనుమతిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు సాధ్యమైనంత వరకు వర్క్‌ఫ్రం హోమ్‌కే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. వైరస్‌ను అదుపు చేసేందుకు మరిన్ని చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు.