కరోనా.. కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని ముప్పుతిప్పలు పెడుతోంది. చైనాలో గతేడాది డిసెంబర్లో తొలిసారి గుర్తించిన ఈ వైరస్.. అతి తక్కువ సమయంలోనే అన్ని దేశాల్లో అడుగుపెట్టింది. అందుకే టీవీలు, రేడియోలు, సామాజిక మాధ్యమాలు.. ఇలా ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. వ్యాక్సిన్ లేని ఈ వైరస్ కోసం.. మీడియా సంస్థలు విపరీతంగా ప్రచారం చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాయి. అయితే ఈ మహమ్మారి గురించి తెలియని కొందరు సమాజంలో ఉన్నారంటే ఆశ్చర్యపోక తప్పదు కదా.
సగానికి పైగా...
ఆఫ్రికా ఖండంలోని సోమాలియాలో అడుగుపెడుతున్న కొందరు వలస కూలీలకు.. కరోనా గురించి తెలియనే తెలియదట. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) చేసిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇథియోపియా నుంచి కూలీలు సోమాలియా వెళ్తుంటారు. మరికొంతమంది నిత్యం దాడులు జరిగే యెమెన్ గుండా సౌదీ అరేబియాకు నడక మార్గంలో వెళ్తుంటారు. ఇందుకోసం ఎర్రసముద్రాన్ని ఆశ్రయిస్తారు. అయితే సోమాలియా సరిహద్దు వద్ద వలస కూలీలను కలిసి ఐఓఎం బృందం.. పలు ప్రశ్నలు సంధించింది. ఇందులో 51 శాతం మంది వలస కార్మికులకు కరోనా గురించి తెలియదట. అసలు ఆ పేరు వినలేదని చెప్పారట. అలాంటి 3471 మందిని గుర్తించినట్లు ఆ సంస్థ తెలిపింది.
సర్వేలో ప్రశ్నలు ఇలా..!
సర్వేలో వలసదారులకు సులభమైన ప్రశ్నలనే వేస్తుంటారు. ఎక్కడనుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? మీ గుంపులో ఎంత మందికి కరోనా వైరస్ గురించి తెలుసు? సోమాలియాలో కరోనా ఉందని తెలుసా? అని అడుగుతారు. అలా జూన్ 20న ముగిసిన సర్వే ఫలితాల్లో నిర్ఘాంతపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో దాదాపు సగం మంది అసలు కరోనా గురించి వినలేదని చెప్పడం కలవరానికి గురిచేస్తోంది.
" తొలిసారి వారి నుంచి వచ్చిన స్పందన చూసి షాకయ్యా. ఇథియోపియాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా మంది వలస కూలీలు సోమాలియా వెళ్తుంటారు. వారికి సరైన చదువు ఉండదు. ఇంటర్నెట్ సౌకర్యాలు లేవు. ఈ ప్రాంతాల్లో చాలా రోజులుగా ఇంటర్వ్యూ చేస్తున్నాం. తొలుత 88 శాతం మందికి వైరస్ గురించి తెలియదని చెప్పారు. చాలా మందికి యెమెన్లో వాళ్లు వెళ్లే ప్రాంతాల్లో యుద్ధం జరుగుతుందని తెలియదని చెప్పేవారు. అప్పట్నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం"