అనతికాలంలోనే యావత్ ప్రపంచాన్ని చుట్టేసిన కొవిడ్ మహమ్మారిపై పోరులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో పరీక్షలను చేపడుతున్నారు. అయితే, కరోనా నిర్థరణ పరీక్షల ఫలితాలు కచ్చితంగా రాకపోవడం ప్రస్తుతం ఓ సవాల్‌గా మారింది. దీంతో కొవిడ్ టెస్టుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు వైరస్‌ను కచ్చితంగా గుర్తించలేకపోతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న వార్తలు, వాటి విశ్వాసాన్ని మరోసారి ప్రశ్నార్థకంగా మార్చాయి. ఈ ర్యాపిడ్ టెస్టులపై తాజాగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కూడా కీలక వ్యాఖ్యాలు చేశారు.
'ఏదో తీవ్రమైన బోగస్ జరుగుతోంది. ఓకే రోజు నాలుగు సార్లు టెస్టులు చేయించుకున్నాను. వీటిలో రెండు టెస్టుల్లో నెగెటివ్, మరో రెండు టెస్టులు పాజివివ్ వచ్చాయి. ఒకే మిషిన్, ఒకే పరీక్ష, ఒకే నర్సు' అంటు కరోనా టెస్టుపై ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. ఓ ల్యాబ్‌లో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయించుకున్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలు భిన్నంగా రావడంతో మరో ల్యాబ్‌లో ఆర్‌టీ-పీసీఆర్ టెస్టు కూడా చేయించుకున్నానని, ఆ ఫలితం కోసం వేచిచేస్తున్నట్లు మస్క్ ట్విటర్‌లో వెల్లడించారు. మీకు ఏమైనా కొవిడ్ లక్షణాలు ఉన్నాయా? అని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు 'సాధారణ జలుబు' ఉన్నట్లు ఎలాన్ మస్క్ సమాధానమిచ్చారు. అయితే, అంతగా ఇబ్బంది లేదని ఆయన స్పష్టంచేశారు.