దక్షిణాఫ్రికాలోని అత్యంత ప్రభావవంతమైన జాతి నాయకుడు, ప్రవాస భారతీయ సమాజంతో సత్సబంధాలను కాంక్షించిన కింగ్ గుడ్విల్ జ్వెలిథిని (72) ఇక లేరు. మధుమేహ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ నెలరోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన శుక్రవారం కన్నుమూశారు. జులు జాతి నాయకత్వ పరంపరలో ఎనిమిదో నేతగా వారసత్వాన్ని అందుకున్న జ్వెలిథిని, 50 ఏళ్ల పాటు ఆ హోదాలో కొనసాగారు. ఏ రాజకీయ పదవి చేపట్టకపోయినా 1.2 కోట్లకు పైగా ఉన్న జులు ప్రజలపై గణనీయమైన ప్రభావం చూపారు. తన జాతి ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన సందర్భాలూ ఉన్నాయి. తన పాలనలోని క్వాజులు-నటల్ ప్రావిన్సులో భూమిని పునఃపంపిణీ చేయడానికి దక్షిణాఫ్రికా ప్రభుత్వం నూతన విధానం తీసుకొచ్చే యత్నాలు చేసినప్పుడు జ్వెలిథిని తప్పుపట్టారు. ఆ విధానం అమలు చేస్తే జులు రాజ్యానికి చెందిన భూమిని స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది. దీన్ని జ్వెలిథిని గట్టిగా వ్యతిరేకించారు.
హెచ్ఐవీపై, ఇటీవల కరోనాపైనా పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. జ్వెలిథిని మరణంపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫొస సంతాపం వ్యక్తం చేశారు. క్వాజులు-నటల్ ప్రావిన్సు ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధికి కృషి చేయడం ద్వారా జ్వెలిథిని దేశ పురోగతికి పాటుపడ్డారంటూ ఈ సందర్భంగా రమఫొస గుర్తు చేసుకున్నారు.