దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తృత వేగంగా వ్యాపిస్తోంది. దీంతో ఆ దేశంలో కేసుల సంఖ్య రోజురోజుకు రెట్టింపవుతోంది. ప్రమాదకరంగా భావిస్తోన్న ఈ వేరియంట్ ఇప్పటికే 30కిపైగా దేశాలకు విస్తరించింది. దీంతో ఆయా దేశాలు కట్టడి చర్యలు ముమ్మరం చేశాయి. అయితే, ఒమిక్రాన్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నప్పటికీ తీవ్ర వ్యాధితో ఆస్పత్రుల్లో చేరికలు తక్కువగానే ఉంటున్నట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా వెల్లడించారు. ఈ వేరియంట్ కారణంగా ఆందోళనకర పరిస్థితులు తలెత్తే ప్రమాదం కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం ఘనా పర్యటనలో ఉన్న ఆయన.. దక్షిణాఫ్రికా ప్రయాణాలపై పలు దేశాలు ఆంక్షలు విధించడాన్ని తప్పుబట్టారు.
"మరిన్ని పరీక్షలతో పాటు ఈ వేరియంట్ సంక్రమణపై పరిశోధనలు చేయాల్సి ఉంది. ఆస్పత్రుల్లో చేరికలు కూడా భారీ స్థాయిలో ఉండడం కనిపించడం లేదు. ఇది ఎంతో ఊరట కలిగించే విషయం"
---రమఫోసా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు