ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కొవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు చాలా దేశాలు టీకాను అభివృద్ధి చేశాయి. తమ దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించాయి. కానీ, ఆఫ్రికాలోని కొన్ని పేద దేశాలు ఇప్పటికీ వ్యాక్సిన్లు అందక సతమతమవుతున్నాయి. దాదాపు 12కుపైగా పేద దేశాలకు ఇప్పటివరకు టీకా డోసులు అందలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఇందులో సగానికిపైగా దేశాలు ఆఫ్రికాలోనే ఉన్నట్లు పేర్కొంది.
ఛాద్, బుర్కినా ఫాసో, బురుంది, ఎరిత్రియా, టాంజానియా దేశాల్లో ఒక్కరికీ టీకా తీసుకునే భాగ్యం కలగలేదు.
టీకాల పంపిణీ ఆలస్యం చేయడం వల్ల ఆఫ్రికా దేశాలను కొవిడ్ చిన్నాభిన్నం చేస్తోందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీకాలలో 1 శాతం టీకాలు ఇచ్చినా ఆఫ్రికా పేద దేశాలకు సరిపోతాయని స్పష్టం చేసింది.
కొత్త వేరియంట్లు వస్తే..?
వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకాని దేశాల్లో వైరస్ ఉత్పరివర్తనం చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని యునిసెఫ్ సంబంధిత కొవాక్స్ కార్యక్రమం కో ఆర్డినేటర్ జియాన్ గాంధీ స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు పేద దేశాలకు సాయం చేయాలని కోరారు.
పేద దేశాలకు టీకా అందించడమే లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి కొవాక్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయినా.. చాధ్, టాంజానియా, ఎరిత్రియా మొదలైన దేశాలకు వ్యాక్సిన్లు అందకపోవడం గమనార్హం.