దక్షిణ సోమాలియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ ప్రముఖ హోటల్‌పై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. పర్యటకులు, స్థానికులే లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సుమారు 26 మంది మరణించారు.
కారులో పేలుడు పదార్థాలను నింపుకుని వచ్చిన ఉగ్రవాది కిస్మయో నగరంలోని మెదినా హోటల్ వద్ద ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు కొద్ది సమయం ముందు పలువురు సాయుధ ఉగ్రవాదులు హోటల్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. పోలీసుల దుస్తులు ధరించిన ఉగ్రవాదులు హోటల్లోకి ప్రవేశించినట్లు క్షతగాత్రులు చెప్పారు.
సమాచారం అందుకున్న భద్రత దళాలు ఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ముష్కరులు, బలగాల మధ్య సుమారు 12 గంటల పాటు భీకర పోరు జరిగింది.
హోటల్‌పై దాడి చేసింది తామేనని ఆల్-షబాబ్ ఉగ్రసంస్థ ప్రకటించింది.