5 లక్షల కొవిడ్ వ్యాక్సిన్ డోసుల సరఫరాకు సంబంధించిన నగదును దక్షిణాఫ్రికాకు తిరిగి చెల్లించింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. తమ దేశంలో విజృంభిస్తున్న కరోనా రకానికి సీరం సంస్థ అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ప్రభావవంతంగా పని చేయట్లేదని తేలినందున.. టీకా సరఫరాను నిలిపివేయాలని కోరినట్లు దక్షిణాఫ్రికా తెలిపింది. ఈ మేరకే డబ్బులను తమకు సీరం సంస్థ తిరిగి చెల్లించినట్లు వెల్లడించారు దక్షిణాఫ్రికా ఆరోగ్య మంత్రి జ్వేలీ ఖిజే.
"5 లక్షల ఆస్ట్రాజెనెకా టీకా డోసులను సరఫరా చేయనందున సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డబ్బులను తిరిగి చెల్లించింది. మా బ్యాంక్ ఖాతాల్లో ఆ డబ్బులు ఇప్పటికే జమ అయ్యాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌తో సత్ఫలితాలు రానందున.. ఆ టీకాలను అనవసరంగా కొనుగోలు చేయవద్దని మేం నిర్ణయించుకున్నాం."
- జ్వేలీ ఖిజే, దక్షిణాఫ్రికా ఆరోగ్య మంత్రి