నల్ల సూరీడు నెల్సన్ మండేలా నడయాడిన నేల.. అల్లర్లు, లూటీలతో అట్టుడుకుతోంది. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాకు జైలు శిక్ష విధింపుతో మొదలైన దొమ్మీలు ఉద్రిక్తతకు దారి తీశాయి. భద్రతా బలగాలు-స్థానికుల మధ్య ఘర్షణలతో.. వీధులు రణరంగాన్ని తలపిస్తున్నాయి. దుకాణాలు, వాణిజ్య సముదాయాలపై దాడి చేస్తున్న స్థానికులు.. అందినకాడికి దోచుకుపోతున్నారు. ఈ అల్లర్లలో ఇప్పటివరకు 45 మంది మరణించారు. ఈ అల్లర్ల వెనుక కుట్ర కోణం ఉందని ప్రస్తుత అధ్యక్షుడు రామాఫోసా అనుమానం వ్యక్తం చేశారు.
తారస్థాయికి..
కోర్టు ధిక్కరణ కేసులో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాకు ఆ దేశ సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించడంతో ప్రారంభమైన అల్లర్లు తారస్థాయికి చేరాయి. మూడో రోజులుగా జరుగుతున్న అల్లర్లతో దక్షిణాఫ్రికా అట్టుడుకుతోంది. అతిపెద్ద నగరమైన జోహన్నెస్‌బర్గ్‌లో మొదలైన అలర్లు.. అత్యధిక జనాభా కలిగిన గౌటెంగ్‌కు వ్యాపించాయి.
జోహన్నెస్‌బర్గ్‌లో పేద ప్రాంతాల్లో ఉన్న వాణిజ్య సముదాయాలు, దుకాణాలపై వేలాది స్థానికులు దోపిడీకి తెగబడ్డారు. అందినకాడికి దోచుకున్నారు. పోలీసుల బెదిరింపులను బేఖాతరు చేస్తూ.. స్థానికులు దొమ్మికి దిగుతున్నారు. ఆంక్షలను ధిక్కరిస్తూ క్వాజుల్, నాటాల్, గౌటెంగ్ ప్రావిన్సులలో పదుల సంఖ్యలో దుకాణాల్లో దోపిడీకి దిగారు. ఈ దోపిడీల నేఫథ్యంలో జోహన్నెస్‌బర్గ్‌లోని సంపన్న ప్రాంతాల్లో ఉన్న మాల్స్, రిటైల్ కేంద్రాలను మూసివేశారు. వేలాది మంది దుకాణాలపై దాడికి పాల్పడుతుండడం వల్ల వారిని అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేస్తున్నారు.