రిచర్డ్ ట్యురెరె.. ఈ పేరు ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ.. ఆ బాలుడి ప్రతిభకు సలాం కొడతారు. అతడి ఆలోచన.. గొప్ప ఆవిష్కరణకు బీజం వేసింది. అదే ఇప్పుడు అతడ్ని ఉన్నత స్థాయిలో నిల్చోబెట్టింది. కెన్యా ప్రజలకు అతడంటే గౌరవం పెరిగింది.
కెన్యాలో అడవుల విస్తీర్ణం ఎక్కువ. ఇది సింహాలు, పులులు, హైనా వంటి క్రూరమృగాలు సహా ఏనుగులు, రైనో వంటి జంతువులకు నిలయం. ఇదే అక్కడి ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టాయి. దేశంలో ఎక్కువమందికి జీవనాధారం పశువుల పెంపకం. కానీ.. ఈ క్రూరమృగాలు, ముఖ్యంగా సింహాల వేటతో వారికి కంటిమీద కునుకు లేకుండా పోయింది. కెన్యా నైరోబి నేషనల్ పార్క్ సమీపంలో ఉండే రిచర్డ్ కుటుంబానికీ ఈ కష్టాలు తప్పలేదు. వారికి ఉన్న ఒక్కగానొక్క ఎద్దును కూడా ఓ రోజు సింహం చంపేసింది.
ఆవుల షెడ్డుల్లో రాత్రి పూట కాపలా కాస్తుండే రిచర్డ్‌కు.. అప్పటినుంచే సింహాలంటే అసహ్యం వేసింది. వాటిని సమీపంలోని పశువుల శాలలో అడుగుపెట్టకుండా చూడాలని కంకణం కట్టుకున్నాడు.
మొదట మంటకు (నిప్పు) సింహాలు భయపడతాయని భావించి.. అలా చేసినా ఫలించలేదు.
రెండోది దిష్టిబొమ్మలు ఉపయోగించడం. అక్కడే నిలబడినట్లు నటిస్తే అవి పారిపోతాయని అనుకున్నాడు. కానీ.. సింహాలు తెలివైనవి కదా. అవి కదలట్లేదని తెలిసిపోయింది వాటికి. ఇది కూడా విఫలమే.
ఒక్క ఫ్లాష్‌తో..
ఇక ఓ రోజు మామూలుగా ఆవుల షెడ్డు పక్కన టార్చ్ పట్టుకొని తిరుగుతూ ఉండగా.. సింహాలు రాలేదు. అప్పుడు తట్టిందతనికి అసలైన వాస్తవం. అవి కదిలే టార్చ్‌కు (కాంతికి) భయపడుతున్నాయని గ్రహించి.. కొత్త ఆవిష్కరణ చేశాడు. వాళ్లమ్మ రేడియో తీసుకొని.. ప్రయోగాలు చేశాడు. ఎలక్ట్రానిక్స్‌పై అవగాహన పెంచుకున్నాడు. ఇక ఓ పాత కారు బ్యాటరీ, ఇండికేటర్ బాక్స్, ఓ స్విచ్, విరిగిపోయిన ఓ ఫ్లాష్ లైట్ తీసుకొని దానిని పశువుల షెడ్ ముందు అమర్చాడు.
ఇదీ చూడండి: వామ్మో... ఇంత పెద్ద సాలెగూళ్లా?