క్వీన్ విక్టోరియా, సిసిల్ రోడ్స్, కింగ్ లియోపోల్డ్... ఇలా వలసపాలకుల గౌరవార్థం ఏర్పాటు చేసిన విగ్రహాలను ధ్వంసం చేయడం ఆఫ్రికాలో చాలా ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. ఒకప్పుడు వలసదారుల గుప్పిట్లో ఉన్న దేశాల ప్రజలు.. స్వతంత్రం పొందిన తర్వాత ఆయా పాలకుల విగ్రహాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. జాత్యహంకారానికి ప్రతీకగా నిలుస్తున్నాయని ఆరోపిస్తూ వాటిని కూల్చివేస్తున్నారు.
దక్షిణాఫ్రికా
కేప్‌టౌన్ విశ్వవిద్యాలయం ప్రవేశద్వారం నుంచి సిసిల్ రోడ్స్ విగ్రహాన్ని తొలగించాలని 2015 ఏప్రిల్‌లో ఓ విద్యార్థి బృందం పెద్ద ఎత్తున డిమాండ్ చేసింది. శ్వేతజాతీయులైన మైనారిటీలకు మద్దతిచ్చిన నియంతృత్వ నేతల విగ్రహాలను ధ్వంసం చేశారు. క్రేన్ల సాయంతో విగ్రహాలను పెకలించివేశారు. ప్రస్తుతం ఈ విగ్రహాన్ని స్థానిక సైనిక స్థావరం వద్ద టార్పాలిన్‌తో కప్పి ఉంచారు.
జింబాబ్వే
స్వతంత్రం లభించిన కొద్ది రోజుల్లోనే 1980 జులైలో రోడ్స్ విగ్రహాన్ని జింబాబ్వే వాసులు కూల్చేశారు. రాజధాని హరారేలో ఉండే ఈ విగ్రహాన్ని సుత్తులతో కొట్టి ధ్వంసం చేశారు.
నైరోబి
కెన్యాలోని నైరోబిలో బ్రిటన్ రాణి విక్టోరియా విగ్రహాన్ని 2015లో గుర్తు తెలియని నిరసనకారులు ధ్వంసం చేశారు. విగ్రహం తలను వేరు చేశారు. ఈ విగ్రహాలు అప్పటి బానిసల జీవితాన్ని ఇంకా గుర్తు చేస్తాయని ప్రజలు చెబుతున్నారు.
"ఈ విగ్రహం మన పూర్వీకులు వలసవాదుల చేతిలో పడిన బాధలను గుర్తు చేస్తుంది. ఈ విగ్రహాలను చూసినప్పుడల్లా ఆ జ్ఞాపకాలు కళ్లముందు మెదులుతాయి. వీటిని మనం వదిలించుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా వీటిని తొలగించి వలసవాదం నుంచి బాధపడుతున్న ప్రజలందర్నీ ఈ రకమైన బాధల నుంచి రక్షించాల్సిన అవసరం ఉంది."
-శామ్యూల్ ఒబీరో, నైరోబి నివాసి
బెల్జియం వలసపాలకుడు కింగ్ లియోపోల్డ్-2 గౌరవార్థం నెలకొల్పిన విగ్రహాన్ని దశాబ్దాల క్రితమే కాంగో వాసులు కూల్చివేశారు. 1928లో నిర్మించిన ఈ విగ్రహాన్ని 1960లో దేశానికి స్వతంత్రం లభించిన తర్వాత అప్పటి నియంత మొబుటు సెసె ఆదేశాల ప్రకారం తొలగించారు.
వలసపాలనకు ప్రతీకగా ఈ విగ్రహాన్ని 2005లో పునఃప్రతిష్ఠ చేశారు అధికారులు. ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడం వల్ల ఒక రోజు తర్వాత దాన్ని తొలగించారు.
ఇప్పుడు ఆ ప్రతిమను ఐక్యరాజ్య సమితి కాంగోలో ఏర్పాటు చేసిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ మ్యూజియంలోని వలసపాలకుల విగ్రహాల పార్కులో భద్రపరిచారు. ఈ మ్యూజియంలోకి ప్రజలకు అనుమతి ఉన్నప్పటికీ.. విగ్రహాల పార్కు అధ్యక్షుడి భవనానికి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడికి పరిమితంగానే అనుమతిస్తారు. హెన్రీ మోర్టాన్, స్టాన్లీ, డేవిడ్ లివింగ్‌స్టోన్ వంటి అన్వేషకుల విగ్రహాలు సైతం ఈ పార్కులో ఉన్నాయి.
ఆఫ్రికా బాటలో
ఈ తరహా ఉద్యమాలనే అమెరికా, ఐరోపాలో ప్రస్తుతం నిరసనకారులు అవలంబిస్తున్నారు. పోలీసు చేతిలో మరణించిన ఆఫ్రో-అమెరికన్ జార్జి ఫ్లాయిడ్‌కు నివాళిగా... బానిస వ్యాపారులు, వలసపాలకుల విగ్రహాలే కేంద్రంగా ఆందోళనలు సాగిస్తున్నారు. జాతివిద్వేషానికి వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో ఈ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు.
ఇదీ చదవండి-ప్రధాని పదవికే వన్నె తెచ్చిన 'పీవీ'