ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలతో నిమిషానికి 11మంది మరణిస్తున్నారు. గతేడాదితో పోల్చితే కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్న జనాభా ఆరింతలు పెరిగింది. పేదరికం నిర్మూలన కోసం కృషి చేస్తోన్న సంస్థ ఆక్స్ఫామ్ ఈ వివరాలను వెల్లడించింది.
ఆక్స్ఫామ్ విడుదల చేసిన 'ది హంగర్ మల్టిప్లైస్' నివేదిక ప్రకారం.. కరోనాతో నిమిషానికి ఏడుగురు ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనాతో పోల్చితే..ఆకలి చావులే ఎక్కవ. 15.5కోట్లు మంది తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గతేడాదితో పోల్చితే ఇది 2కోట్లు ఎక్కువ. సైనిక సంఘర్షణల కారణంగా ఆయా దేశాల్లోని మూడింట రెండోంతుల మంది ఆకలి సమస్యలతో విలవిలలాడుతున్నారు.
కరోనా సంక్షోభం, పర్యావరణ మార్పు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తుల ధరలు 40శాతం పెరిగాయి. ఇది దశాబ్ద కాలంలోనే అత్యధికం కావడం ఆందోళనకరం. ఫలితంగా లక్షలాది మంది ఆహార సంక్షోభంలోకి జారుకున్నారు.
"కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ నాశనమైంది. పర్యావరణ సంక్షోభం తీవ్రమవుతోంది. వీటన్నిటికి తోడు, సైనిక సంఘర్షణల వల్ల 5.2లక్షలమంది ఆకలితో విలపిస్తున్నారు. కరోనాపై యుద్ధం చేయడం మానేసి, ఆయ దేశాలు ఒకదానిపై మరొకటి గొడవకు దిగాయి. ఆర్థికంగా కుదేలైన లక్షలాది మందిపై ఈ భారం పడింది. కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ, ప్రజలు ఆకలితో విలపిస్తున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా సైనిక కార్యకలాపాల కోసం కేటాయించే నిధులు 51 బిలియన్డాలర్లు పెరగడం ఆందోళనకరం. ప్రపంచవ్యాప్తంగా ఆకలి చావులను నిలువరించేందుకు ఐరాస నిర్దేశించిన వ్యయం కన్నా ఇది దాదాపు ఆరు రెట్లు ఎక్కువ."