సూడాన్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన అల్లర్లలో 60మంది మృతిచెందినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. మరో 60 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డట్లు పేర్కొంది. పశ్చిమ డార్ఫర్ ప్రావిన్సులోని మస్తేరీ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
సూడాన్లోని 'యూఎన్ ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హుమానిటేరియన్ అఫైర్స్' (ఓసీహెచ్‌ఏ) వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం ఓ వర్గానికి చెందిన 500మంది సాయుధులు మస్తేరీ గ్రామంపై దాడికి దిగారు. మసలిట్, ఇతర అరబ్ తెగల మధ్య ఈ ఘర్షణలు జరిగాయి. శనివారం సాయంత్రం ప్రారంభమైన ఈ ఘర్షణలు ఆదివారం ఉదయం వరకు కొనసాగాయి. మొత్తం 60మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. 60మంది తీవ్రంగా గాయపడడం వల్ల వారందరినీ హెలికాప్టర్‌లో జెనేనా పట్టణంలోని ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో దుండగులు అనేక ఇళ్లను దోచుకున్నారు. అనంతరం వాటికి నిప్పంటించారు. దాడి తరువాత రక్షణ కల్పించాలని కోరుతూ స్థానికులు నిరసన చేపట్టారు. అధికారులు చర్యలు తీసుకునే వరకు చనిపోయిన వారికి అంత్యక్రియలు చేసేది లేదని స్థానిక నాయకుల నివాసాల ముందు బైఠాయించారు.