Omicron Replace Delta: మొన్నటివరకు డెల్టా వేరియంట్‌తో సతమతమైన ప్రపంచ దేశాలు.. తాజాగా ఒమిక్రాన్ భయంతో వణికిపోతున్నాయి. డెల్టాతో పోలిస్తే వేగంగా వ్యాపించే సామర్థ్యం ఉండడంతోపాటు రోగనిరోధకతను ఏమార్చే గుణం ఉన్నట్లు నివేదికలు వస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా వచ్చిన ఓ అధ్యయనం ఊరట కలిగిస్తోంది. మునుపటి వేరియంట్లను ఎదుర్కొనే రోగనిరోధకత కొత్త వేరియంట్ ఇన్‌ఫెక్షన్ల వల్ల కలుగుతున్నందున డెల్టా వేరియంట్ స్థానాన్ని ఒమిక్రాన్ భర్తీ చేయవచ్చని దక్షిణాఫ్రికా నిపుణుల తాజా అధ్యయనం అంచనా వేసింది. ముఖ్యంగా ఒమిక్రాన్ సోకిన వారిలో డెల్టాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి మెరుగైన స్థాయిలో పెరుగుతున్నట్లు గుర్తించింది. ఒకవేళ ఇదే కొనసాగితే డెల్టాతో రీ-ఇనఫెక్షన్ బారినపడకుండా కాపాడడంతో పాటు తీవ్రవ్యాధి నుంచి రక్షణ కల్పించడంలో ఒమిక్రాన్ దోహదం చేస్తున్నట్లు అంచనా వేసింది.
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి, ప్రభావాలను అంచనా వేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా ఒమిక్రాన్ సోకిన ఓ 33 మందిపై దక్షిణాఫ్రికా నిపుణులు అధ్యయనం చేపట్టారు. వ్యాక్సిన్ తీసుకున్న, తీసుకోని వారిని పరిగణనలోకి తీసుకున్నారు. ఒమిక్రాన్ సోకిన వారిలో డెల్టాను తటస్థీకరించే సామర్థ్యం పెరిగినట్లు గుర్తించారు. దీనర్థం మరోసారి డెల్టా సోకే సామర్థ్యం తగ్గడమేనని అధ్యయనం చేసిన నిపుణులు వెల్లడించారు.
Omicron Symptoms:
అయితే, డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వ్యాధి తీవ్రత తక్కువగా ఉందా? లేదా అనే విషయంపై ఇది ఆధారపడి ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ఒకవేళ ఇదే నిజమైతే కొవిడ్ తీవ్రత తగ్గే అవకాశాలు అధికంగా ఉంటాయని వెల్లడించారు. ఇలా దక్షిణాఫ్రికా అనుభవాలను బట్టి ఒమిక్రాన్ తక్కువ వ్యాధికారకమైనదే అయితే.. డెల్టాను పారదోలడంలో ఇది ఎంతగానో సహాయపడుతుందని ఆఫ్రికా ఆరోగ్య పరిశోధనా సంస్థలోని ప్రొఫెసర్ అలెక్స్ సిగాల్ వెల్లడించారు. దీనివల్ల వ్యక్తిగతంగాను, సమాజంపై ఇన్‌ఫెక్షన్ ప్రభావం భారీగా తగ్గిపోతుందని అంచనా వేశారు.
ఇదిలాఉంటే, డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ఆస్పత్రుల్లో చేరికలు, వ్యాధి తీవ్రత ముప్పు తక్కువగానే ఉన్నట్లు దక్షిణాఫ్రికా నుంచి వెలువడ్డ పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు 130 దేశాలకు విస్తరించగా కొన్ని దేశాల్లో మాత్రమే కొవిడ్ మరణాలు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా వైరస్ లక్షణాలు కూడా డెల్టాతో పోలిస్తే స్వల్పంగానే ఉంటున్నట్లు ఇప్పటివరకు ఉన్న సమాచారం బట్టి తెలుస్తోంది.
Omicron India: 100 దేశాలకుపైగా విస్తరించిన ఒమిక్రాన్ వేరియంట్ బాధితులు త్వరగానే కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. చాలా వరకు స్వల్ప లక్షణాలతోనే బాధపడుతున్నారు. డెల్టా సమయంలో ఆక్సిజన్ స్థాయులు పడిపోవడం, నిమోనియా బారినపడటం సహా మరణాలు భారీగా సంభవించాయి.