Omicron virus news: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్.. ఆఫ్రికాలో తొమ్మిది దేశాలకు విస్తరించింది. అందులో బోట్సువానా, ఘనా, మోజాంబియా, నమీబియా, నైజీరియా, సెనెగల్, ఉగాండ, జింబాబ్వేలు ఉన్నాయి.
దక్షిణాఫ్రికాలో వేలసంఖ్యలో కేసులు వెలుగుచూస్తుండగా.. ఉగాండలో మొదటిసారిగా ఏడుగురికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నమోదైంది. నమీబియాలో 18 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. నైజీరియాలో తాజాగా మూడు కేసులు వెలుగుచూశాయి.
దక్షిణాఫ్రికా వ్యాపారానికి తీవ్ర దెబ్బ..
దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వెలుగుచూసినప్పటి నుంచి ఆ దేశంపై ప్రపంచదేశాలు ప్రయాణ ఆంక్షలు విధించాయి. విమాన రాకపోకలు స్తంభించాయి. దీంతో ఆ దేశ వ్యాపారంపై తీవ్రమైన దెబ్బపడింది. కరోనా కారణంగా 2020లో దక్షిణాఫ్రికా పర్యటకం 70 శాతానికి పడిపోయింది. దక్షిణాఫ్రికా పర్యటకానికి ప్రధాన ఆధారమైన బ్రిటన్ ప్రస్తుతం ఒమిక్రాన్ దృష్ట్యా ఆ దేశాన్ని రెడ్ లిస్ట్‌లో చేర్చింది.
యూకే కొత్త నిబంధనలు..
ఒమిక్రాన్ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కొత్త నిబంధనలను తీసుకువచ్చింది బ్రిటన్. తమ దేశంలోకి రావడానికి 48 గంటల ముందు కొవిడ్ నెగటివ్ రిపోర్ట్‌ను తప్పనిసరి చేసింది. రెడ్ లిస్ట్ దేశాల నుంచి వచ్చేవారికి ప్రభుత్వ క్వారెంటైన్‌లోనే ఉండేలా నిబంధనలు విధించింది.