ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌కు నైజీరియా శాస్త్రవేత్తల బృందమొకటి వ్యాక్సిన్ కనిపెట్టినట్లు సమాచారం. ఈ విషయాన్ని నైజీరియన్ యూనివర్సిటీలు ప్రకటించాయని స్థానిక మీడియా ద్వారా తెలిసింది.
భారత్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, చైనా, ఆస్ట్రేలియా సహా అనేక దేశాలు వ్యాక్సిన్ కోసం విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నాయి. కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 13 వ్యాక్సిన్లను మనుషులపై ప్రయోగిస్తున్నారు. 120 సంస్థలు సూదిమందు కనుగొనడంలో నిమగ్నమయ్యాయి.
ఆఫ్రికన్ల కోసం..
ఆఫ్రికాలో ఆఫ్రికన్ల కోసం ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామని అడిలెక్ యూనివర్సిటీలో మెడికల్ వైరాలజీ, ఇమ్యునాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ ప్రత్యేక నిపుణుడు, డాక్టర్ ఒలడిపో కొలవోల్ ప్రకటించారని ది గార్డియన్ నైజీరియా తెలిపింది. ఈ పరిశోధనకు ఆయనే నేతృత్వం వహించారు.
18 నెలల సమయం..
ఈ సూదిమందు అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు కనీసం 18 నెలల సమయం పడుతుందని ఒలడిపో అన్నారు. మరిన్ని ట్రయల్స్, విశ్లేషణ అవసరమని, వైద్య అధికార వర్గాల నుంచి అనుమతుల రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సార్స్ కోవ్- 2 జీనోమ్ కోసం ఆఫ్రికా మొత్తం విస్తృతంగా అన్వేషించామని ఆయన వెల్లడించారు.
వ్యాక్సిన్ నిజమే..
వ్యాక్సిన్ కనుక్కోవడం వాస్తవమేనని ప్రీసియస్ కార్నర్స్టోర్ వర్సిటీ ప్రొఫెసర్ జూలియస్ ఒలోక్ కూడా తెలిపారు. "వ్యాక్సిన్ నిజమే. మేం చాలాసార్లు ప్రయోగాలు చేసి విశ్లేషించాం. ఆఫ్రికన్లే లక్ష్యంగా తయారు చేశాం. ఇతరులు కూడా ఉపయోగించొచ్చు. ఇది పనిచేస్తుంది. నకిలీది కాదు. అంకితభావానికి వచ్చిన ఫలితమే ఇది. చాలామంది శాస్త్రవేత్తలు ఇందుకోసం ఎంతగానో శ్రమించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ అవసరం ఎంతో ఉంది. అందుకే మేం దీనిపై దృష్టిపెట్టాం" అని ఆయన వివరించారు.