సైన్యం తిరుగుబాటు కారణంగా లిబియా రాజధాని ట్రిపోలీలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులు వెంటనే ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాలని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సూచించారు. సుమారు 500 మందికి పైగా నగరంలో చిక్కుకున్నారని తెలిపారు.
లిబియా నుంచి వచ్చేయండి: సుష్మా స్వరాజ్ - ట్రిపోలీ
లిబియా రాజధాని ట్రిపోలీ నగరాన్ని భారతీయులు ఖాళీ చేయాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సూచించారు. లిబియా ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు కారణంగా ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 500 మందికిపైగా భారతీయులు ట్రిపోలీలో చిక్కుకున్నారని, తక్షణం ఖాళీ చేయకుంటే ప్రమాదమేనని హెచ్చరించారు.
"ఇప్పటికే లిబియా నుంచి భారీ సంఖ్యలో భారతీయులను తరలించాం. కానీ ట్రిపోలీలో ప్రయాణంపై నిషేధం విధించటం వల్ల ఇంకా 500 మందికిపైగా భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు. లిబియాలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. ఇంకా విమాన సర్వీసులు నడుస్తుండటం ఉపశమనం కలిగించే విషయం. దయచేసి మీ బంధువులు, స్నేహితులను ట్రిపోలీ నుంచి తక్షణమే వచ్చేయమని చెప్పండి. తరవాత వారిని మేము ఖాళీ చేయించలేం." - సుష్మా స్వరాజ్, భారత విదేశాంగ మంత్రి
లిబియా ప్రధాని ఫాయెజ్ అల్ సరాజ్కు వ్యతిరేకంగా సైనిక కమాండర్ ఖలీఫా హాఫ్త్ నేతృత్వంలో భద్రతా దళాలు తిరుగుబాటు చేస్తున్నాయి. ఫాయెజ్ను అధికారం నుంచి దించేందుకు దేశ వ్యాప్తంగా దాడులు చేస్తున్నాయి. గత రెండు వారాల్లో ట్రిపోలీలో 200 మందికి పైగా మరణించారు. ఫాయెజ్కు ఐక్యరాజ్య సమితి మద్దతు తెలిపింది.