Kenya Drought: తీవ్ర కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్న కెన్యాలో ప్రజలే కాకుండా జంతువులు కూడా దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా అక్కడి వన్యప్రాణులపై దీని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. తాగేందుకు చుక్కనీరు దొరక్క అల్లాడిపోతున్న వన్యప్రాణులు.. అడుగు ముందుకు వేయలేక, ఎక్కడికక్కడే విగతజీవులుగా మారిపోతున్న ఘటనలు హృదయాలను కదలిస్తున్నాయి. తాజాగా కెన్యాలోని సబూలీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో నీటి కోసం అల్లాడిన జిరాఫీలు.. చివరకు ప్రాణాలు కోల్పోయి గుంపులుగా పడివున్న దృశ్యాలు అక్కడి కరవు కాటకాలకు అద్దం పడుతున్నాయి.
గతకొంత కాలంగా కెన్యా ఈశాన్య ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇవి అక్కడి వాజిర్ కౌంటీలోని సబూలీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోని జంతువులకు ప్రాణసంకటంగా మారాయి. ఎక్కడ చూసినా తిండి, నీరు లభించక ప్రాణాలు కోల్పోయిన జంతువుల కళేబరాలే దర్శనమిస్తున్నాయి. తాజాగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఉన్న కొన్ని జిరాఫీలు నీటి కోసం తీవ్రంగా వెతికాయి. చివరకు బురదగా మారిన ఓ నీటి కుంటవద్దకు వెళ్లిన మూగజీవాలు అక్కడే కూరుకుపోయాయి. అనంతరం తిండి, నీరు లేక అక్కడే జీవితాన్ని చాలించాయి. అలా ఓ ఆరు జిరాఫీలు ఒకేచోట విగత జీవులుగా పడివున్న హృదయ విదారక దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కేవలం ఇవే కాకుండా ఎన్నో వందల వన్యప్రాణులు ఆహారం, నీరు దొరక్క తనువు చాలిస్తున్నట్లు అక్కడి నివేదికలు వెల్లడిస్తున్నాయి.
జాతీయ విపత్తు..