మారిషస్ రక్షణ అవసరాలు తీర్చేందుకు భారత్ ముందుకొచ్చింది. ద్వీప దేశానికి 100మిలియన్ డాలర్లు(దాదాపు రూ.724 కోట్లు) రుణ సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు మారిషస్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇరుదేశాల సంయుక్త సమావేశంలో వెల్లడించారు. సమగ్ర ఆర్థిక సహకార భాగస్వామ్య ఒప్పందం(సీఈసీపీఏ)లో భాగంగా ఈ రుణాన్ని అందించనున్నట్లు జైశంకర్ తెలిపారు.
హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మక భాగస్వామిగా మారిషస్‌ను భారత్ భావిస్తోంది. ఆ దేశ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్‌తో సమావేశమైన జైశంకర్.. ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు. మారిషస్‌తో కుదిరిన సమగ్ర ఆర్థిక సహకార భాగస్వామ్య ఒప్పందాన్ని ఓ మైలురాయిగా అభివర్ణించారు.
''ఇరు దేశాల మధ్య ఉన్నతంగా చర్చలు జరిగాయి. సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నాం. మారిషస్‌లో భారత్ ఆధ్వర్యంలో చేపడుతోన్న వివిధ ప్రాజెక్టుల అమలుపై చర్చించాం.''
-ఎస్.జైశంకర్, భారత విదేశాంగ మంత్రి