దక్షిణాఫ్రికాలోని జోహన్సెస్ బర్గ్ జూలో ఉన్న మకోకో అనే గొరిల్లా... ఇటీవలె అనారోగ్యానికి గురైంది. 34 ఏళ్ల ఆ జంతువును 64 కి.మీ దూరంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాలని అనుకుంది జంతుప్రదర్శన శాల యాజమాన్యం. 210 కిలోల బరువున్న ఆ గొరిల్లాను స్కానింగ్‌కు తీసుకెళ్లేందుకు హెలీకాప్టర్‌ను వినియోగించారు అధికారులు. చికిత్స చేయగా.. ప్రస్తుతం కోలుకున్నట్లు తెలిపారు. అయితే దాన్ని ఆసుపత్రికి తరలించినప్పుడు తీసిన వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇదే సమస్య..
ఈ భారీ జంతువు ఊపిరి పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతోందని జూ యాజమాన్యం తెలిపింది. చాలా రోజులుగా దానికి వైద్యం అందించినా స్పందించట్లేదట. జూన్ 11న ఆరోగ్యం విషమించడం వల్ల ఆ జంతు ప్రదర్శనశాలకు 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఆసుపత్రికి హెలీకాప్టర్ సాయంతో తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు అధికారులు.
మాకోకో నాసికా భాగాలను పరిశీలించిన వైద్యులు.. ముక్కు లోపల కణితుల ఉండటం వల్ల ఊపిరి పీల్చుకోవడంలో గొరిల్లా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. అయితే దానికి గంటలు శ్రమించి విజయవంతంగా చికిత్స అందించినట్లు తెలిపారు వైద్యులు. ప్రస్తుతం మకోకో కోలుకున్నట్లు చెప్పారు. జులై 9న ఇది 35వ పుట్టినరోజు జరుపుకోనుందట.
ఇదీ చూడండి:రోడ్లు ఊడ్చి మనసు దోచేశాడు- ఉద్యోగం కొట్టేశాడు!