ఇప్పటికే కరోనాతో సతమతమవుతుండగా.. ఆఫ్రికా దేశం గినియాలో మరో ప్రాణాంతక వైరస్ వెలుగుచూసింది. ఓ వ్యక్తికి మార్బర్గ్ వైరస్ సోకినట్లు గినియా సర్కారు తెలిపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది. ఆగస్టు 6న.. మార్బర్గ్ వైరస్ వ్యాధి(ఎంవీడీ) నిర్ధరణ అయినట్లు డబ్ల్యూహెచ్ఓకు గినియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసినట్లు పేర్కొంది. ఈ వైరస్ వ్యాప్తి నియంత్రణకు తక్షణమే చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించింది.
ఆస్పత్రిలో చేరిన మరుసటి రోజే మరణం
గతనెల 25న... సియెర్రా లియోన్, లైబీరియన్ సరిహద్దులకు సమీపంలోని ఎన్జెరెకోర్ ప్రాంతంలోని ఓ వ్యక్తిలో ఎంవీడీ లక్షణాలు కనిపించగా.. ఆగస్టు 1న జ్వరం, తలనొప్పి, అలసట, కడుపు నొప్పి, చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటి లక్షణాలతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పరీక్షించగా.. మార్బర్గ్ వైరస్‌గా తేలింది. దీంతో రీహైడ్రేషన్, పేరెంటరల్ యాంటీబయాటిక్స్ సాయంతో బాధితుడికి చికిత్స అందించినట్లు అధికారులు తెలిపారు. అయితే మరుసటి రోజే అతను మరణించినట్లు పేర్కొన్నారు.
ఈ విషయమై లోతుగా పరిశోధన చేయడానికి జాతీయ వైద్యాధికారులతో పాటు డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల బృందం కూడా అక్కడికి వెళ్లింది. ఆ మృతదేహం నుంచి లాలాజల నమూనాలు సేకరించి.. మార్బర్గ్తో పాటు ఎబోలా పరీక్షలు చేశారు. ఇందులో మార్బర్గ్ పాజిటివ్‌గా తేలిందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.