తెలంగాణ

telangana

ETV Bharat / international

హెర్డ్ ఇమ్యూనిటీ అసాధ్యం! మరి కరోనా కట్టడి ఎలా? - herd immunity covid vaccine

అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, రకరకాల వేరియంట్లుగా రూపాంతరం చెందుతూ మానవాళికి సవాల్ విసురుతోంది కరోనా మహమ్మారి. వైరస్ వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో.. హెర్డ్ ఇమ్యూనిటీ సాధిస్తే కరోనా అంతమవుతుందని అందరూ అంచనా వేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యమని స్పష్టమవుతోంది. వ్యాక్సిన్లను కూడా తట్టుకునేలా డెల్టా వంటి రకాలు ఉద్భవిస్తున్నాయి. మరి వైరస్​ను నిలువరించేందుకు ప్రపంచం ముందున్న పరిష్కార మార్గాలేంటి..?

COVID-19 herd immunity? It's not going to happen, so what next?
హెర్డ్ ఇమ్యూనిటీ అసాధ్యం! మరి కరోనాను నిలువరించడం ఎలా?

By

Published : Aug 4, 2021, 5:48 PM IST

Updated : Aug 4, 2021, 5:54 PM IST

కొవిడ్​-19 కొద్ది నెలలు మాత్రమే ఉంటుందని వైరస్ వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో అంతా భావించారు. కానీ గాలి ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందని తెలిశాక.. దశల వారీగా మహమ్మారి విజృంభిస్తుందనే సూచనలు కనిపించాయి. 1918లో కోట్ల మంది ప్రాణాలను బలిగొన్న స్పానిష్ ఫ్లూ మహమ్మారి సమయంలోనూ సరిగ్గా ఇలాగే జరిగింది. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కొవిడ్​ వైరస్ ఉత్పరివర్తనం చెందుతూ అనేక రకాల వేరియంట్లుగా ఉద్భవిస్తోంది. హెర్డ్ ఇమ్యూనిటీని, వ్యాక్సిన్లను తట్టుకునే సామర్థ్యంతో వేగంగా వ్యాపిస్తూ మనవాళి మనుగడకు సవాల్ విసురుతోంది. ప్రపంచ దేశాలను మళ్లీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న డెల్టా వేరియంటే ఇందుకు ఉదాహరణ.

కరోనా టీకా ఇచ్చేందుకు సిరంజ్ సిద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ వైద్య సిబ్బంది

హెర్డ్ ఇమ్యూనిటీ అసాధ్యం!

చైనా​లో కరోనా పరీక్ష కోసం సాంపిల్​ సేకరిస్తున్న వైద్య సిబ్బంది

హెర్డ్ ఇమ్యూనిటీ సాధిస్తే కరోనా అంతమవుతుందని నిపుణులు, రాజకీయ నాయకులు సహా అనేక మంది గతేడాది అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే వారి భావన తప్పు అని స్పష్టమవుతోంది. వైరస్ వివిధ రకాలుగా ఉత్పరివర్తనం చెందుతుండటం వల్ల హెర్డ్​ ఇమ్యూనిటీ దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇక దీనిపై చర్చించకుండా ఇతర సాధ్యాసాధ్యాలను పరిశీలించడం మేలు. హెర్డ్​ ఇమ్యూనిటీకి బదులు కరోనాతో కలిసి జీవించడం ఎలా? అనే అంశం గురించి మాట్లాడుకోవడం మంచిది.

హెర్డ్ ఇమ్యూనిటీతో వైరస్ అంతం అవుతుందని భావించడం వల్ల కూడా ప్రజల్లో తప్పుడు నమ్మకాలు ఏర్పడే ప్రమాదముంది. ఇక వ్యాక్సిన్ అవసరం లేదని వారు కరోనా టీకా తీసుకోవడానికి ముందుకు రాకపోవచ్చు. టీకాలపై విశ్వాసం సన్నగిల్లవచ్చు.

టోక్యో వ్యాక్సినేషన్​ సెంటర్​లో ఫైజర్ టీకా తీసుకుంటున్న నగరవాసి

దక్షిణాఫ్రికా ప్రభుత్వం 67 శాతం ప్రజలకు టీకాలు వేసింది. అయినా అక్కడ వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో వ్యాక్సిన్ల వల్ల ప్రయోజనం ఏంటి అనే సందేహాలు ప్రజలకు రావచ్చు. కానీ డెల్టా వంటి అత్యంత ప్రమాదకర వేరియంట్లను తట్టుకోగల రోగనిరోధక శక్తి రావాలంటే దాదాపు 84 శాతం ప్రజలు హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడం అవసరం.

హెర్డ్ ఇమ్యూనిటీ అంటే?

హెర్డ్ ఇమ్యూనిటీ అంటే వైరస్​ సోకిన వ్యక్తి నుంచి మరొకరికి వ్యాధి వ్యాప్తి చెందని దశ. ప్రజలందరిలో వైరస్​ను తట్టుకోగల రోగ నిరోధక శక్తి ఏర్పడటం. అతి తక్కువ మందికి మాత్రమే వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలుండటం. వైరస్​ సోకినా వేగంగా కోలుకోగల సామర్థ్యం కలిగి ఉండటం. సరిగ్గా చెప్పాలంటే కరోనా వైరస్ వ్యాప్తి చైన్​కు అడ్డుకట్ట వేయడం.

కరోనా టీకా కేంద్రంలోకి వెళ్లేందుకు బ్రెజిల్​లో బారులు తీరిన ప్రజలు

అయితే కరోనా వ్యాప్తి తర్వాత వచ్చిన కొన్ని మార్పుల కారణంగా హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదని తేటతెల్లమైంది.

ఏంటా మార్పులు?

  • కరోనా వైరస్ ఉత్పరివర్తనం చెందుతూ కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. దీని వల్ల వైరస్​ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. డెల్టా వేరియంటే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. మొదట సార్స్ కొవ్​-2 రీప్రొడక్టివ్ రేటు 2.4 నుంచి 4 వరకు మాత్రమే ఉంది. కానీ డెల్టా వేరియంట్​ వచ్చాక అది 6కు చేరింది.
    వుహాన్​లో కరోనా టెస్టు కోసం లైన్లో నిల్చున్న ప్రజలు
  • రీప్రోడక్టివ్ రేటు అంటే వైరస్​ ఒకరి నుంచి సగటున ఎంత మందికి వ్యాప్తి చెందే అవకాశాలున్నాయో తెలపడం. ఇది 4గా ఉంటే.. ఒక్కరి నుంచి నలుగురికి వైరస్ వ్యాప్తి చెందుతుందని అర్థం.
  • వైరస్ మ్యుటేషన్ల కారణంగా యాంటీబాడీలను, వ్యాక్సిన్లను తట్టుకునే విధంగా అవి మారుతున్నాయి.
  • యాంటీబాడీల ప్రతిస్పందన కారణంగా కనీసం మూడు నుంచి 9 నెలల వరకు మాత్రమే మనకు రక్షణ లభిస్తుందని ప్రస్తుత అధ్యయానాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ కొత్త వేరియంట్ల నుంచి రక్షణ లభిస్తుందని కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు.
  • ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్​ పంపిణీ నెమ్మదిగా సాగుతుండటం వల్ల హెర్డ్ ఇమ్యూనిటీ స్థాయిని చేరుకోవడం మరో సమస్య. ప్రస్తుతం అల్పాదాయ దేశాల్లో కేవలం ఒక్క శాతం మందికే వ్యాక్సిన్ అందించారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 27 శాతం మంది మాత్రమే కనీసం ఒక్క డోసు తీసుకున్నారు. డెల్టా వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉన్న ఈ సమయంలో మొత్తం జనాభాలో 84 శాతం మందికి టీకా లభిస్తేనే వైరస్​ నుంచి రక్షణ పొందగలం.

నెక్స్ట్​ ఏంటి?

బీజింగ్​లోని సబ్​వే స్టేషన్లో ఫేస్​ మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటిస్తూ నడుస్తున్న ప్రజలు

కరోనాతో ఎలా కలిసి జీవించాలో తెలుసుకోవడమే ఈ సమస్యకు ఏకైక పరిష్కారం. వైరస్ ముప్పు అధికంగా ఉన్న వృద్ధులు, పెద్ద వయస్కుల వారికి వీలైనంత త్వరగా టీకాలు అందించాలి. ఇది దక్షిణాఫ్రికాలో త్వరగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగు కోట్ల మందికి టీకాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న అక్కడి ప్రభుత్వం 2 కోట్ల మందికి వ్యాక్సినేషన్​ పూర్తి చేసింది. వీరిలో 90 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారు, 35 ఏళ్లు పైబడి ఆరోగ్య సమస్యలున్న వారిలో 90 శాతం మందికి టీకా అంది ఉండాలి. అలా జరిగితే దక్షిణాఫ్రికాలో జనజీవనం సాధారణ స్థితికి చేరుకునే వీలుంటుంది. వైరస్​ వ్యాప్తి కొనసాగుతున్నా... ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య, ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య మునుపటి స్థాయిలో ఉండదు. శ్వాస సంబంధిత సమస్యలకు కారణమయ్యే సాధారణ వైరస్​లానే కరోనా కూడా ప్రతిరోజు ఉంటుంది. రోజూ మరణాలు నమోదవుతూనే ఉంటాయి. కానీ కరోనా మొదలైన తొలినాళ్లలా వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి మాత్రం ఉండదు.

బ్రిటన్​తో..

మనం మున్ముందు ఎలా జీవించబోతున్నామో బ్రిటన్ తెలియజేస్తోంది. అక్కడ మళ్లీ సాధారణ జీవన విధానం మొదలవుతోంది. కరోనా ముప్పు ఎక్కువగా ఉన్న వారందరికీ అక్కడి ప్రభుత్వం టీకాలు వేసింది. ప్రస్తుతం బ్రిటన్​లోని పెద్ద వయస్కుల వారిలో దాదాపు 85 శాతం మంది కనీసం ఒక్క డోసు టీకా తీసుకున్నారు. ఫలితంగా ప్రభుత్వం ఆంక్షలన్నీ ఎత్తివేస్తోంది.

బ్రిటన్​లో డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నా.. ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య, మరణాల సంఖ్యలో పెద్దగా వ్యత్యాసం కనిపించడం లేదు. కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరి ప్రాణాలు కోల్పోయిన వారిలో 97 శాతం మంది టీకా తీసుకోని వారే ఉన్నారు. టీకా తీసుకుంటే ఏ మేర రక్షణ లభిస్తుందో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.

థాయ్​లాండ్​లో పీపీఈ కిట్​తోనే పెట్రోల్​ బంకుకు వచ్చిన ఆరోగ్య కార్యకర్తలు

ఇదీ చదవండికరోనా వ్యాక్సిన్​పై అనుమానాలా?.. ఇదిగో క్లారిటీ!

Last Updated : Aug 4, 2021, 5:54 PM IST

ABOUT THE AUTHOR

...view details