Coronavirus in South Africa: యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌తో దక్షిణాఫ్రికా నాలుగో వేవ్ చవిచూసింది. ఈ వేరియంట్ తొలిసారిగా వెలుగు చూసింది కూడా అక్కడే. అయితే, తాజాగా అక్కడ వైరస్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం వల్ల ఆంక్షలను సడలిస్తున్నట్లు దక్షిణాఫ్రికా ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి లక్షణాలు లేకుంటే అసలు ఐసోలేషన్ అవసరమే లేదని ప్రకటించింది. అంతేకాకుండా పాఠశాలల్లో ఒక మీటరు భౌతికదూరం ఉండాలంటూ విధించిన ఆంక్షలను కూడా ఎత్తివేస్తున్నట్లు వెల్లడించింది.
"తాజా నిబంధనల ప్రకారం, పాజిటివ్ వచ్చిన వారికి లక్షణాలేమీ లేకుంటే ఐసోలేషన్ అవసరం లేదు. టెస్టు తర్వాత లక్షణాలు కనిపిస్తే మాత్రం ఏడు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి. ఇదివరకు ఈ వ్యవధి పది రోజులుగా ఉంది. అంతేకాకుండా కొవిడ్ భాధితులకు సన్నిహితంగా మెలిగిన వారిలో లక్షణాలు లేకుంటే వారు కూడా ఐసోలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదు"
- దక్షిణాఫ్రికా ప్రభుత్వం.
నేషనల్ కరోనా వైరస్ కమాండ్ కౌన్సిల్‌తోపాటు ప్రెసిడెంట్ కోఆర్డినేటింగ్ కౌన్సిల్ ఇచ్చిన నివేదికల ఆధారంగానే కొవిడ్ ఆంక్షలను సడలించినట్లు దక్షిణాఫ్రికా అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. ముఖ్యంగా 60 నుంచి 80 శాతం ప్రజల్లో కొవిడ్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ఉన్నట్లు ఇప్పటివరకు వచ్చిన సీరో సర్వేల నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఇప్పటి నుంచి పాఠశాలల్లో ఒక మీటరు భౌతిక దూరం ఉండాలన్న నిబంధనను తొలగిస్తున్నట్లు దక్షిణాఫ్రికా ప్రభుత్వం పేర్కొంది. అయితే, బహిరంగ ప్రదేశాల్లో మాత్రం మాస్కులు ధరించడం, భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించాలని అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వారు తక్షణమే తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గత రెండేళ్లుగా భౌతికదూరం ఆంక్షలు అమలులో అక్కడి పాఠశాలలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి ఊపిరి పీల్చుకున్నట్లు అయ్యింది.
ఇదీ చూడండి:తీవ్రంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ ఉప వేరియంట్