ఆఫ్రికాలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ ఖండంలో వైరస్ బారిన పడ్డవారి సంఖ్య శుక్రవారంతో లక్ష దాటింది. అందులో 3,100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కేసుల పెరుగుదల కలవర పెడుతున్నప్పటికీ, వైరస్ సంక్రమణ వేగం నిలకడగానే ఉండటం కొంత ఊరటనిచ్చే విషయం. తమ ఖండంలో గతవారం నమోదైన కేసుల సంఖ్య.. అంతకుముందు వారంలో వెలుగుచూసినవాటితో దాదాపు సమానంగా ఉందని ఆఫ్రికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాల డైరెక్టర్ జాన్ ఎన్‌కెంగసాంగ్ తెలిపారు. ఆఫ్రికా దేశాల్లోని ఆస్పత్రుల్లో మౌలిక వసతులు అంతంతమాత్రమే. వాటిలో వైరస్ విజృంభిస్తే మూడు లక్షల వరకు మరణాలు సంభవించే ముప్పుందని అంచనాలు వెలువడుతున్నాయి.
11 రోజుల్లో...
బ్రెజిల్‌లో కొవిడ్ విలయం కొనసాగుతోంది. 24 గంటల్లో 1,188 మంది మృత్యువాతపడ్డారు. అక్కడ ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక మరణాలివే. దీంతో మొత్తం మృతుల సంఖ్య 20వేలు దాటింది. 11 రోజుల్లోనే బ్రెజిల్‌లో మరణాల సంఖ్య రెట్టింపవడం గమనార్హం.
- రష్యాలో కొత్తగా 8,894 మంది కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. బ్రిటన్‌లో తాజాగా 351 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియాలో శుక్రవారం 20 కొత్త కేసులు వెలుగుచూశాయి.
- కొవిడ్ మృతులకు సంతాప సూచకంగా ఫెడరల్ భవనాలపై జాతీయ జెండాను సగానికి అవనతం చేసి ఉంచాలని ఆదేశించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.
- టాంజానియా ప్రభుత్వ వైఖరి ఆందోళన కలిగిస్తోంది. వైరస్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వ్యక్తులు, ప్రతిపక్ష నేతలను దేశాధ్యక్షుడు జాన్ మగుఫులి అరెస్టు చేయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కరోనా కట్టడికి మూడు రోజులుప్రార్థనలు చేయాలని మార్చిలో ప్రజలను మగుఫులి ఆదేశించారు. అనంతరం, ప్రార్థనలు ఫలించి వైరస్ నియంత్రణలోకి వచ్చిందని ప్రకటించారు.
6.60 లక్షల మంది వలస బాట...
కొవిడ్ సంక్షోభంలోనూ పలు దేశాల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయి. మార్చి 23 నుంచి ఇప్పటివరకూ 6.60 లక్షల మంది ఇళ్లు వదిలి వలస బాట పట్టాల్సి వచ్చింది. సాయుధ వర్గాలు, సైన్యం మధ్య ఘర్షణల కారణంగా ఒక్క కాంగోలోనే 4.80 లక్షల మంది వలస వెళ్లారు.