తెలంగాణ

telangana

By

Published : Jun 18, 2021, 3:00 PM IST

ETV Bharat / international

వజ్రం రూపంలో ఆ దేశాన్ని వరించిన అదృష్టం

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వజ్రం.. దక్షిణాఫ్రికా దేశమైన బోట్స్​వానాలో బయటపడింది. 1,098.3 క్యారెట్లతో, 73 మిల్లీమీటర్ల పొడవు, 52 మిల్లీమీటర్ల వెడల్పుతో ఉన్న ఈ వజ్రాన్ని డెబ్​స్వానా అనే డైమండ్​ కంపెనీ వెలికితీసింది. అనంతరం.. దానిని బోట్స్​వానా అధ్యక్షుడు మాక్​గ్వీట్సీకి అప్పగించింది.

big diamond
అతిపెద్ద వజ్రం

ప్రపంచంలోని మూడో అతిపెద్ద వజ్రం.. దక్షిణాఫ్రికాలోని బోట్స్​వానాలో బయటపడింది. 1,098.3 క్యారెట్లతో ఉన్న ఈ వజ్రాన్ని ఈ నెల ప్రారంభంలో జవానెంగ్​ అనే గనిలో డెబ్​స్వానా అనే డైమండ్​ కంపెనీ కనుగొంది. 73 మిల్లీమీటర్ల పొడవు, 52 మిల్లీమీటర్ల వెడల్పు, 27 మిల్లీమీటర్ల మందంతో ఈ వజ్రం ఉందని ఆ సంస్థ తెలిపింది. గత 50 ఏళ్లలో తమకు దొరికిన వజ్రాల్లో ఇదే అతిపెద్దదని డెబ్​స్వానా తాత్కాలిక డైరెక్టర్​ లైనెట్​ ఆర్మ్​స్ట్రాంగ్​ తెలిపారు. ప్రాథమిక విశ్లేషణ తర్వాత దీనిని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వజ్రంగా భావిస్తున్నామని చెప్పారు. దీనిని ఆ దేశ అధ్యక్షుడు మాక్​గ్వీట్సీకి అప్పగించినట్లు వెల్లడించారు.

ఫుల్​ ఇన్​కమ్​!

డెబ్​స్వానా డైమండ్​ సంస్థను బోట్స్​వానా ప్రభుత్వంతో పాటు డి బీర్స్​ గ్రూప్​ సంస్థ నిర్వహిస్తోంది. 1969 నుంచి బోట్​స్వానాలో డెబ్​స్వానా సంస్థ వజ్రాల వెలికితీత చేపడుతోంది. 1993లో 446 క్యారెట్లతో ఉన్న పెద్ద వజ్రాన్ని ఈ సంస్థ కనుగొంది. కొవిడ్​ మహమ్మారి విజృంభణతో అతలాకుతలమైపోయిన బోట్​స్వానా ఆర్థిక వ్యవస్థకు ఈ వజ్రం దొరకటం శుభ పరిణామమని నిపుణులు భావిస్తున్నారు. ఈ వజ్రం ద్వారా ఆ దేశ ఎగుమతుల్లో 2/3 వంతుకు సమానమైన ఆదాయం సమకూరుతుందని ఆశిస్తున్నారు.

మూడూ ఆఫ్రికాలోనే..

గతంలో దొరికిన అతిపెద్ద వజ్రాలలో మొదటి రెండు కూడా ఆఫ్రికాలోనే దొరికాయి. మొదటి అతిపెద్ద 3,106 క్యారెట్ల వజ్రం 1905లో దక్షిణాఫ్రికాలో దొరికింది. దీనికి కుల్లినన్ డైమండ్​ అని పేరు పెట్టారు. 2015లో బోట్స్​వానాలో లుకారా డైమండ్స్ 1,109 క్యారెట్ల 'లెసెడి లా రోనా' అనే రెండో అతిపెద్ద వజ్రాన్ని వెలికి తీసింది. అయితే.. డెబ్​స్వానా సంస్థ తాజాగా వెలికితీసిన ఈ వజ్రానికి ఇంకా పేరు పెట్టలేదు.

ఇదీ చూడండి:diamond: పుడమి పుత్రుడు.. ఒక్కరోజులోనే కోటీశ్వరుడయ్యాడు!

ఇదీ చూడండి:దేశంలోనే అతిపెద్ద వజ్రాల గని ఇదే...

ABOUT THE AUTHOR

...view details