రిచర్డ్ టోంగీ..కెన్యా విదేశీ వ్యవహారాల మంత్రి. ఈయనకు భారత్‌తో విడదీయరాని సంబంధం ఉంది. ఔరంగాబాద్‌లోని మౌలానా కళాశాలలో 34 ఏళ్ల క్రితం రిచర్డ్ చదువుకున్నారు. ఆ సమయంలో వఖేహడేనగర్ ప్రాంతంలో ఉండేవారు. అప్పట్లో స్థానిక వ్యాపారి గవాలీ దుకాణం నుంచి నిత్యవసర వస్తువులు తీసుకునేవారు. ఆ క్రమంలో రూ.200 బాకీపడ్డారు. అనంతంరం రిచర్డ్ కెన్యా వెళ్లిపోయారు.
కాలచక్రం గిర్రున తిరిగి 34 ఏళ్లు గడిచిపోయాయి. ప్రస్తుతం రిచర్డ్ కెన్యా విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి అయ్యారు. అయినప్పటికీ గవాలీ కుటుంబానికి రూ.200 ఇవ్వాలన్న సంగతిని మాత్రం మరచిపోలేదు. ఈ క్రమంలో మంగళవారం ఔరంగాబాద్ వచ్చి గవాలీ వారసుడు కాశీనాథ్ గవాలీకి రూ.200 ఇవ్వబోయారు. ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన కాశీనాథ్ రూ.200 తీసుకునేందుకు నిరాకరించారు. రిచర్డ్‌కు, ఆయన భార్యకు చక్కని విందు ఇచ్చారు. తాను చదువుకునే రోజుల్లో గవాలీ కుటుంబం ఎంతో సహకరించిందని రిచర్డ్ చెప్పుకొచ్చారు.
"ఇది నాకు ఎంతో భావోద్వేగంతో కూడుకున్న విషయం. చాలా మంది దీనిని అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ నా వద్ద డబ్బులు లేక కష్టాలు పడుతున్న సమయంలో, గవాలీ కుటుంబసభ్యులు నాకు కావలసిన వస్తువులను అరువుగా ఇచ్చేవారు. అయితే చాలా సార్లు ఆ డబ్బును తిరిగి చెల్లించలేకపోయేవాడిని. ఆ విషయం మా మనస్సులో మెదులుతుండేది.