తెలంగాణ

telangana

ETV Bharat / international

అల్జీరియా అధ్యక్షుడి రాజీనామా- ప్రజల సంబరాలు

దేశవ్యాప్తంగా తనపై పెల్లుబికిన నిరసనలకు అల్జీరియా అధ్యక్షుడు అబ్దెల్​అజీజ్​ బౌటేఫ్లికా తలొగ్గారు. సైన్యాధిపతి ఫోన్​ చేసి హెచ్చరించిన కాసేపటికే రాజీనామా ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు.

అల్జీరియా అధ్యక్షుడు అబ్దెల్​అజీజ్​ బౌటేఫ్లికా రాజీనామా

By

Published : Apr 3, 2019, 9:42 AM IST

Updated : Apr 3, 2019, 10:59 AM IST

అల్జీరియా అధ్యక్షుడు రాజీనామా ప్రజల సంబురాలు
20 సంవత్సరాలపాటు సుదీర్ఘ కాలం పదవిలో కొనసాగిన అల్జీరియా అధ్యక్షుడు అబ్దెల్​అజీజ్​ బౌటేఫ్లికా ఎట్టకేలకు రాజీనామా చేశారు. పదవి నుంచి తప్పుకోవాలని 6 వారాలుగా ప్రజలు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేయడమే ఇందుకు కారణం.

ఏప్రిల్​ 28న తన పదవీకాలం ముగిసిన అనంతరం బౌటేఫ్లికా రాజీనామా చేస్తారని ఆయన కార్యాలయం ఆదివారం ప్రకటించినా ప్రజలు వెనక్కి తగ్గలేదు. రాజధాని అల్జీర్స్​లో ఆందోళనలు ఉద్ధృతం చేశారు. పరిస్థితి చేయి దాటే ప్రమాదముందని ఆ దేశ సైన్యాధ్యక్షుడు 82 ఏళ్ల బౌటేఫ్లికాను ఫోన్లో హెచ్చరించారు. రాజీనామా చేయడమే మేలని సూచించారు. చేసేది లేక... బౌటేఫ్లికా పదవీ కాలం ముగియక ముందే గద్దె దిగారు.

బౌటేఫ్లికా రాజీనామాతో వందలాది మంది ప్రజలు రాజధాని ఆల్జీర్స్​లో సంబరాలు జరుపుకున్నారు. కార్ల హార్న్​ మోగిస్తూ, పాటలు పాడుతూ, అల్జీరియా జెండాలను ప్రదర్శిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

ఎలా ముందుకు..?

బౌటేఫ్లికా రాజీనామాను ఆ దేశ రాజ్యాంగ కమిటీ బుధవారం ఆమోదించనుంది. ఎగువసభ అధ్యక్షుడు దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. అల్జీరియా రాజ్యాంగం ప్రకారం ఆయన 90 రోజులపాటు కొనసాగొచ్చు. ఈలోగా కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగాలి.

ప్రస్తుతం అల్జీరియా ఎగువసభ అధ్యక్షుడిగా ఉన్న అబ్దెల్​కాదర్​ బెన్సాలా కూడా బౌటేఫ్లికా సహచరుడే. ఈ నేపథ్యంలో అల్జీరియాలో పరిపాలనా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్​ చేస్తున్న ​ప్రజలు నిరసనలు కొనసాగిస్తారా, ఆపేస్తారా అనే సందిగ్ధం నెలకొంది.

Last Updated : Apr 3, 2019, 10:59 AM IST

ABOUT THE AUTHOR

...view details