ఆఫ్రికా దేశం జింబాంబ్వేలో కరోనా విధ్వంసం కొనసాగుతోంది. వారం రోజుల్లోనే ముగ్గురు మంత్రులు వైరస్‌కు బలయ్యారు. ఇప్పటివరకు మొత్తం నలుగురు మంత్రులు కరోనా సోకి మరణించారు. గతవారం చనిపోయిన విదేశాంగమంత్రి అంతక్రియల పూర్తి కాకుండానే మరోమంత్రి ప్రాణాలు విడవటం ఆందోళనకు గురి చేస్తోంది. కొత్తగా నమోదైన 693 కేసులతో కలిపి జింబాంబ్వేలో మొత్తం కేసుల సంఖ్య 30వేల మార్కును దాటింది.
హాంకాంగ్‌లో లాక్డౌన్..
కరోనా కేసుల సంఖ్య ఆందోళకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో హాంకాంగ్ ప్రభుత్వం శనివారం నుంచి లాక్డౌన్ విధించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించింది. రెండు వారాల్లోనే 4,300 కేసులు నమోదు కావడం వల్ల ఈ మేరకు చర్యలు చేపట్టింది. హాంకాంగ్‌లో ఇప్పటివరకు దాదాపు 10వేల కేసులు నమోదయ్యాయి. 168మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 9 కోట్ల 87లక్షల 48వేలు దాటింది. మరణాల సంఖ్య 21లక్షల 16వేలకు పైనే ఉంది. వైరస్ కారణంగా తీవ్రంగా ప్రభవితమైన అమెరికాలో ఒక్కరోజే లక్షా 92వేలకుపైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. మరో 3వేల 800మందికిపై ప్రాణాలు విడిచారు. ఆ దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2కోట్ల 53 లక్షల 90వేలు దాటింది. 4లక్షల 24వేల మందికిపై వైరస్ కారణంగా చనిపోయారు.
ఇదీ చూడండి: అమెరికాలో 200 మంది నేషనల్ గార్డ్స్‌కు కరోనా