మెతుకు లేక, బతకలేక పరాయి దేశం బయల్దేరిన వలసదారుల పడవ ప్రయాణం.. మధ్యలోనే ముగిసిపోయింది! ఆఫ్రికా దేశం జిబౌటీ నుంచి ప్రయాణం సాగిస్తున్న పడవ నీట మునిగింది. అందులో ప్రయాణిస్తున్న 42 మంది వలసదారులు మృతిచెందారు. అయితే వీరందర్నీ స్మగ్లర్లు అక్రమంగా తరలిస్తుండగా, ప్రమాదం చోటుచేసుకుందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్(ఐవోఎం) ప్రాంతీయ డైరెక్టర్ మహమ్మద్ అబ్దికెర్ సోమవారం వెల్లడించారు. మృతులు ఏయే దేశాలకు చెందినవారన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
నీట మునిగిన పడవ.. 42 మంది జలసమాధి - సోమాలియా వలసదారులు
ఆఫ్రికా జిబౌటీ దేశం నుంచి ప్రయాణం సాగిస్తున్న పడవ నీట మునిగి.. 42 మంది వలసదారులు మృతిచెందారు. అయితే.. వీరందరినీ స్మగ్లర్లు అక్రమంగా తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఓ ఆర్గనైజేషన్ పేర్కొంది.
కడు బీదరికం కారణంగా ఇథియోపియో, సోమాలియాల నుంచి వలసదారులు సముద్రయాణం ద్వారా మొదట యెమెన్‌కు చేరుకుని.. అక్కడి నుంచి ధనిక పర్షియన్ గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. ఇప్పుడు మృతిచెందిన వారిలో ఎక్కువమంది ఆ దేశాలకు చెందిన వారే ఉండొచ్చని భావిస్తున్నారు. గత సంఘటనల నేఫథ్యంలో- నిజంగానే పడవ మునిగిందా? లేక స్మగ్లర్లు వారిని నీళ్లలోకి తోసేశారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. గత నెల 80 మంది వలసదారులు జిబౌటీ నుంచి యెమెన్‌కు వెళ్లే పడవ ఎక్కారు. అయితే స్మగ్లర్లు మార్గమధ్యంలో వారిని సముద్రంలోకి నెట్టేశారు. దీంతో వారిలో సుమారు 20 మంది మరణించారు.