శరీరంలో కరోనా వైరస్ విజృంభించిన సమయంలో రోగికి వెంటిలేటర్లపై కృత్రిమ శ్వాస అందించడం అత్యంత కీలకం. ఇదే చావో.. బతుకో తేలుస్తుంది. ప్రస్తుతం ఆఫ్రికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇక్కడ చాలా దేశాల్లో కనీసం వెంటిలేటర్లు లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మొత్తం 54 దేశాలకు గానూ 41 దేశాల్లోని వెంటిలేటర్ల సంఖ్యను కలిపితే దాదాపు 2,000 ఉంటాయి. వీటిల్లో 10 దేశాల్లో వెంటిలేటర్ అన్న పరికరమే లేదు. ఇక చాలా దేశాల్లో సాధారణ సబ్బులు, శానిటైజర్లు కూడా వినియోగించరట.
విజృంభిస్తున్న కరోనా..
దక్షిణ సుడాన్‌లో కొవిడ్-19 విజృంభిస్తోంది. అక్కడ 10 మంది మంత్రులూ ఈ వైరస్ బారినపడ్డారు. ఈ మంత్రులు కరోనా వైరస్ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న సభ్యుడిని కలవడం వల్ల వారికీ సోకింది. ఈ దేశానికి మొత్తం ఐదుగురు ఉపాధ్యక్షులు ఉన్నారు. కానీ దేశం మొత్తంలో నాలుగు వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయి. వీరిలో ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ రిక్ మాచెర్‌కు కరోనా సోకింది. ఆయన భార్యకు కూడా పాజిటివ్ వచ్చింది. దేశం మొత్తంలో 655 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. చాలా ఆఫ్రికా దేశాలలో కేసుల పెరుగుదల వేగం ఎక్కువగా ఉంది. గ్యునియాలో ప్రతి ఆరు రోజులకు, ఘనాలో ప్రతి తొమ్మిది రోజులకు కేసుల సంఖ్య రెట్టింపవుతోంది. ఈ నేపథ్యంలో కనీస సదుపాయాలు లేని ఆ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.