నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడంలో సాయ, సహకారాలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ... ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. అనుబంధ వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఎస్‌ఈసీ, ప్రభుత్వం మధ్య ఈ విధమైన పరిస్థితులు నెలకొనడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. అంతా సవ్యంగా లేదన్న విషయాన్ని రుజువు చేస్తున్నాయని పేర్కొంది. సాాయ సహకారాల కోసం... సమగ్ర వివరాలతో 3 రోజుల్లోగా ప్రభుత్వానికి వినతి సమర్పించాలని ఎస్ఈసీకి సూచించింది. దానిపై స్పందించి తక్షణమే ఆర్థిక, ఆర్థికేతర సహకారాలు అందించాలని ప్రతివాదులుగా ఉన్న పంచాయతీరాజ్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. ఆదేశాలను వారు అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. సీఎస్‌ను ఈ వ్యాజ్యంలో.... సుమోటోగా ప్రతివాదిగా చేర్చింది. కోర్టు ఉత్తర్వుల అమలుపై 15 రోజుల్లో స్థాయీ నివేదిక సమర్పించాలని సీఎస్‌కు స్పష్టం చేసింది.
వ్యవస్థల పవిత్రతను కించపరచడమే..
తీర్పు సందర్భంగా పలు విషయాల్లో ధర్మాసనం ఘాటుగా స్పందించింది. వ్యవస్థలు శాశ్వతం... పదవుల్లో ఉన్న వ్యక్తులు తాత్కాలికమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలంది. ప్రజాస్వామ్య స్తంభాలైన రాజ్యాంగ వ్యవస్థలు దేశంలో పవిత్రతను కలిగి ఉన్నాయన్న ధర్మాసనం...వాటిపై కొందరి ఉద్దేశాలకు ఎక్కువ విలువిస్తూ ప్రోత్సహించడం...వ్యవస్థల పవిత్రతను కించపరచడమే అవుతుందని వ్యాఖ్యానించింది. ఎస్‌ఈసీ స్వయంప్రతిపత్తి కలిగిన స్వతంత్ర, రాజ్యాంగబద్ధ సంస్థే తప్ప.... రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసేది కాదని స్పష్టం చేసింది. ఎస్‌ఈసీ స్వతంత్రంగా, నిష్పాక్షికంగా విధులు నిర్వర్తించేందుకు సహకారం అందించాల్సిందేనని తేల్చిచెప్పింది. ఎస్‌ఈసీ ప్రస్తావించిన సమస్యలను పరిశీలిస్తే...రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోందని వ్యాఖ్యానించింది.ఎస్‌ఈసీ విధులకు తీవ్ర అడ్డంకులు కలిగించినట్లు అర్థమవుతోందని పేర్కొంది. సాయ సహకారాల కోసం, న్యాయవాదుల ఫీజుల చెల్లింపునకు నిధులు విడుదల చేయాలంటూ....ఎస్‌ఈసీ ప్రభుత్వానికి పలు లేఖలు రాసినట్లు ధర్మాసనం ప్రస్తావించింది. తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటున్నట్లుగా ఎస్‌ఈసీ తరఫు సీనియర్ న్యాయవాది చెప్పారని పేర్కొంది.